సింగపూర్.. బాధాకరమైన నిజం! ఆర్థికవ్యవస్థ దారుణంగా పతనం, రికవరీకి కూడా అవి బ్రేక్
కరోనా మహమ్మారి కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. సింగపూర్ ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా దిగజారింది. రెండో క్వార్టర్‌లో అంచనాల కంటే పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా కుంచించుకుపోయిందని ప్రభుత్వం భావిస్తోంది. రెండో క్వార్టర్‌లో కాస్త పుంజుకుంటుందని అంచనా వేశారు. కానీ దారుణ సంక్షోభంలో కూరుకుపోయింది. కరోనా కారణంగా ఆసియాలో వాణిజ్య ఆధారిత ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది.

పెయిన్‌ఫుల్ ట్రూత్
రెండో క్వార్టర్‌లో (ఏప్రిల్-జూన్) జీడీపీ 13.2 శాతం మేర పడిపోయింది. 12.6 శాతం పడిపోతుందని అంచనా వేయగా, అంతకుమించి క్షీణించింది. కరోనా ప్రభావం ఈ దేశంపై ఎక్కువే ఉంది. రెండో క్వార్టర్‌లో ఎక్కువ కాలం లాక్ డౌన్‌లో ఉంది. ఇది బాధాకరమైన విషయమని (పెయిన్‌ఫుల్ ట్రూత్), కరోనా ముందు పరిస్థితికి చేరుకోలేకపోతున్నామని, రికవరీకి మరికొంత సమయం పట్టే అవకాశముందని వాణిజ్య మంత్రి చాన్ చుంగ్ సింగ్ అన్నారు. 2020 క్యాలెండర్ ఇయర్‌లో వృద్ధి 5 శాతం నుండి 7 శాతం కుదించుకుపోతుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు 4 శాతం నుండి 7 శాతం ఉంటుందని భావించారు.

పర్యాటక, రవాణా రంగంలో దారుణ తిరోగమనం
సింగపూర్ చరిత్రలోనే రవాణా, పర్యాటక రంగం పరంగా దారుణ తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్ల ఆర్థిక వృద్ధి ఈ కరోనా దెబ్బతో తుడిచి పెట్టుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో కచ్చితంగా రెండు మూడేళ్ల వృద్ధి తుడిచి పెట్టుకుపోతుందని మంత్రి చాన్ చుంగ్ సింగ్ అన్నారు. వరుసగా రెండు క్వార్టర్లు పడిపోయింది. సింగపూర్ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కూడా సమయం పడుతుందని భావిస్తున్నారు.

రికవరీ వేగానికి ఇవి బ్రేక్..
రెండో క్వార్టర్‌లో వృద్ధి చూస్తే మందగించిన లేదా నెమ్మదించిన ఆర్థిక పునరుద్ధరణకు నిదర్శనమని చెబుతున్నారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కఠినమైన సరిహద్దు నియంత్రణలు, భౌతికదూరం, విదేశీ కార్మికుల కొరత వంటి వివిధ అంశాలు రికవరీ వేగాన్ని అడ్డుకుంటున్నాయని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల 100 బిలియన్ సింగపూర్ డాలర్లు ($72bn) ప్యాకేజీని ప్రకటించింది. సింగపూర్ బ్యాంకు మార్చిలో ద్రవ్య విధానాన్ని సవరించింది. ప్రపంచంలోని బహిరంగ ఆర్థిక వ్యవస్థల్లో సింగపూర్ ఒకటి. ఎగుమతులు ఆర్థిక ఉత్పత్తిలో 200 శాతానికి సమానం. జపాన్ వంటి దేశాలు కూడా సంక్షోభంలోకి వెళ్తున్నాయి. సౌత్ కొరియా ఎగుమతుల క్షీణత రెండంకెలకు చేరుకున్నాయి.