Moonlighting మరోలా వాడుకుంటున్న యువత.. వాడుకున్నోడికి వాడుకున్నంత అంటే ఇదే..
Moonlighting: మూన్‌లైటింగ్ వివాదం ప్రస్తుతం రోజుకో మలుపు తిరగటంతో పాటు మరిన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెస్తోంది. కొందరు ఇది అనైతికం అంటుంటే.. మరికొందరు మాత్రం దానిని తమ భవిష్యత్తుకు ఉపయోగపడేలా వాడేసుకుంటున్నారు. ఇది పెద్ద ఐటీ కంపెనీల్లో అదుపులోకి వస్తున్నప్పటికీ.. స్టార్టప్ కంపెనీల్లో విపరీతంగా పెరిగిపోయిందని నివేదికలు చెబుతున్నాయి.

మూన్‌లైటింగ్ డిబేట్..
రెండో ఉద్యోగం చేయటం మోసం అంటూ చాలా కంపెనీలు మూన్‌లైటింగ్ ను వ్యతిరేకిస్తున్నాయి. అతి కొద్ది సంఖ్యలో సంస్థలు కొన్ని కండిషన్ల మీద ఒప్పుకుంటున్నాయి. తాజాగా అమెరికా టెక్ సంస్థ ఐబీఎం ఎండీ సైతం ఈ విషయంపై ఉద్యోగులకు స్పష్టమైన మెయిల్స్ పంపటం విషయాన్ని కంపెనీలు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాయో అర్థమౌతోంది. కంపెనీలు ఇలాంటి ఫ్రేమ్‌వర్క్‌ను కంపెనీల్లో అస్సలు ఎంకరేజ్ చేయటం లేదు. అయితే మరికొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయాలను చూపుతున్నాయి.

రియల్ స్టోరీ ప్రకారం..
2018లో కళాశాల విద్యను పూర్తి చేసుకున్న యువకుడు.. నేటి చాలా మందిలాగానే సొంతంగా స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నాడు. కొంత కాలం పనిచేశాక దానికి చిన్న గ్యాప్ ఇచ్చి బెంగళూరులోని ఒక పెట్ కేర్ కంపెనీలో పనిచేయటం ప్రారంభించాడు. అలా ఒక సంస్థను విజయవంతంగా నడపటానికి వివిధ విభాగాల్లో అవసరమైన జ్ఞానాన్ని సంపాదించారు. అలా జాబ్ చేస్తూనే కొన్నాళ్లకు తన స్టార్టప్ పై దృష్టి సారించాడు. అనేక అంశాలపై పట్టు సాధించాక ఆగస్టులో ఉద్యోగాన్ని వీడి పూర్తి సమయాన్ని సొంత వ్యాపారానికి కేటాయించాడు. అలా అతడు ఆరు నెలల పాటు మూన్‌లైటింగ్ చేశానని తెలిపాడు.

బడా వ్యాపారవేత్తలు..
గత కాలంలోకి ఒక్క సారి తొంగి చూస్తే.. పైన యువకుడు పాటించిన పద్ధతి మనకు చాలా విషయాలను గుర్తుకు తెస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం విజయవంతమైన వ్యాపారవేత్తలు అదే ఫార్ములాను పాటించారు. వారు తమ తల్లిదండ్రుల కింద ఉన్నప్పుడు తమ కంపెనీల్లో లేదా ఇతర కంపెనీల్లో పనిచేసేవారు. ముఖ్యంగా కింది స్థాయిలో పని ఎలా జరుగుతుంది, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని రూట్ లెవెల్ లో ఎలా సరిదిద్ధాలి వంటి మెళకువలు నేర్చుకునేవారు. అందుకే వారు ఇప్పటికీ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.

నేటి తరం వేరు..
మూన్ లైటింగ్ అవిశ్వాసాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మన ముందుతరం వారు ఒకే చోట ఉద్యోగం చేయటాన్ని ఫాలో అయ్యేవారు. అయితే నేటి తరం ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. చాలా మంది తమ కెరీర్ లో 6 నుంచి 7 ఏళ్ల కాలంలో 3-4 ఉద్యోగాలను మారుతున్నారు. మరికొందరైతే ఇంకా తక్కువ కాలానికే ఉద్యోగాలను మారుస్తున్నారు.

మల్టీ టాస్కింగ్ రాబోతోంది..
ఎవరైనా ఉద్యోగి ప్రస్తుతం ఒకేలాంటి పనిని రెండు సంస్థలకు చేస్తే తప్పు. అయితే తనకు ఉన్న మరో స్కిల్ ద్వారా ఇతర కంపెనీకి మరో రకమైన పనిని చేయటం తప్పుకాదని చాలా మంది అంటున్నారు. అయితే రానున్న కాలంలో ఉద్యోగులు ఆదాయం కోసం ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తారని.. ఇది ఎంతో దూరంలో లేదని నిపుణులు అంటున్నారు. అందుకే చాలా మంది ఒకేసారి అనేక కంపెనీలకు ఫ్రీలాన్సింగ్ చేసేస్తున్నారు.

లాభనష్టాలు ఇలా..
ప్రస్తుతం రెండు ఉద్యోగాలు చేస్తూ ఆదాయం ఎక్కువగా ఉంది. ఇలా ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వ్యక్తి దీనిని ఉపయోగించుకుని రూ.8 నుంచి రూ.20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మూన్‌లైటింగ్‌లో లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. అవి మీరు ఎంచుకున్న కెరీర్‌పై ఆధారపడి ఉంచాయి. మీరు చేసే రెండో ఉద్యోగం వల్ల.. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ ఏ విధంగానూ ప్రభావితం కాకుండా చూసుకోవడం ప్రథమ కర్తవ్యం.