జాక్‌మాపై చైనా అధినాయకత్వం కత్తి, కుబేరుల జాబితాలో వెనక్కి
బీజింగ్: చైనా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వబోయి చిక్కుల్లోపడిన అలీబాబా అధినేత జాక్ మా తాజాగా ఆ దేశ కుబేరుడి స్థానాన్ని కోల్పోయారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం చైనాలోని ధనవంతుల జాబితాలో ఆయన ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. మరోవైపు ఆయన వ్యాపార ప్రత్యర్థుల సంపద భారీగా పెరిగింది. ఆయన కంపెనీలపై చైనా ప్రభుత్వం నిఘా పెట్టడంతో జాక్ మా సంపదతో పాటు స్థానం కూడా పడిపోయింది. 2019, 2020లో వరుసగా రెండుసార్లు జాక్ మా, ఆయన కుటుంబం చైనా కుబేరుల్లో మొదటి స్థానం దక్కించుకుంది. ఈసారి ఆ స్థానం చేజారింది.

టాప్ 4 కుబేరులు వీరే
చైనా కుబేరుడిగా ఈసారి నాంగ్‌వూ స్ప్రింగ్ కంపెనీ అధినేత జోంగ్ షాన్‌షాన్ నిలిచారు. ఆ తర్వాత వరుస రెండు స్థానాల్లో టెన్సెంట్ హోల్డింగ్స్ పోనీ మా, ఈ కామర్స్ పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ ఉన్నారు. జోంగ్ ఆదాయం గత ఏడాది కాలంలో అనూహ్యంగా 85 బిలియన్ డాలర్లకు పెరిగింది. టెన్సెంట్ అధినేత సంపద 70 శాతం ఎగబాకి 74.19 బిలియన్ డాలర్లకు, హువాంగ్ సంపద 283 శాతం ఎగిసి 69.55 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జాక్ మా, ఆయన ఫ్యామిలీ సంపద ఏడాది వ్యవధిలో 22 శాతం పెరిగి 55.64 బిలియన్ డాలర్లగా ఉంది.

జాక్ మాపై చైనా అధినాయకత్వం కత్తి
గత సంవత్సరం అక్టోబర్ నెలలో చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడంతో జాక్ మాపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వం వీడాలని, విస్తృతంగా ఆలోచించాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం ప్రతీకార చర్యకు దిగింది. ఆయన వ్యాపారాలపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. 37 బిలియన్ డాలర్ల విలువచేసే యాంట్ గ్రూప్ ఐపీవోను అడ్డుకుంది. చైనా విడుదల చేసిన టెక్ దిగ్గజాల జాబితా నుండి జాక్ మాను పక్కన పెట్టింది. ఓ సమయంలో జాక్ మా కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. దాదాపు రెండు నెలల తర్వాత వర్చువల్ భేటీలో కనిపించారు. ఇప్పుడు ఆయన చైనా కుబేరుడి స్థానాన్ని కోల్పోయారు.

టాప్ 5లోకి టిక్ టాక్ ఓనర్
గత కొద్ది రోజులుగా బైట్ డ్యాన్స్‌కు చెందిన టిక్ టాక్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఈ సంస్థ అధినేత ఝాంగ్ యిమింగ్ టాప్ 5లోకి దూసుకు వచ్చారు. హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో మొదటిసారి టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. అతని సంపద 54 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేసింది.