షాకింగ్: జులైలో సగానికి తగ్గిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ డీల్స్!
కరోనా వైరస్ ప్రభావం ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ పెట్టుబడులపై కూడా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా జులై నెలలో ఈ డీల్స్ భారీగా పడిపోవటం గమనార్హం. జూన్ నెలలో కూడా మెరుగ్గా ఉన్న ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల వెల్లువ జులై నెలకు వచ్చే సరికి ఢీలా పడిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే నెలతో పోల్చితే ప్రస్తుత జులై నెలలో ఈ పెట్టుబడులు సగం తగ్గిపోవటం ఆందోళనకరం. దేశంలో జులై నెలలో జరిగిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ డీల్స్ తో కూడిన ఒక పూర్తిస్థాయి నివేదికను ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) విడుదల చేసింది. అందులోని వివరాలతో ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం జులై నెలలో అన్ని రకాల ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ డీల్స్ కలిపి కేవలం 4.1 బిలియన్ డాలర్లు గా నమోదు అయినట్లు తేలింది. దీంతో దేశంలో కి ప్రైవేట్ పెట్టుబడుల రాక మందగిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ మరికొన్ని నెలలు వేచి చూస్తే తప్ప దీనిపై ఒక అంచనా కు రావటం కష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మైక్రోసాఫ్ట్ ఆసక్తి.. ముఖేష్ అంబానీ రిలయన్స్‌తో టిక్‌టాక్ చర్చలు

సగానికి సగం...
కరోనా వైరస్ రాక ముందు 2019 జులై నెలలో భారత్ లో మెరుగైన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ డీల్స్ జరిగాయి. ఆ నెలలో ఏకంగా 8.4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు సమకూరాయి. కానీ, సరిగ్గా ఏడాది గడిచే సరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్నట్లే భారత్ నూ పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం 2020 జులై నెలలో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ డీల్స్ సగానికి సగం తగ్గి పోయి 4.1 డాలర్లకు పరిమితం అయ్యాయి. ఇదే ఏడాది జూన్ నెలలో కూడా మన దేశంలో నమోదయిన ప్రైవేట్ ఈక్విటీ డీల్స్ విలువ 6.8 బిలియన్ డాలర్లు గా నిలవటం విశేషం. ఆ రకంగా చూసిన కూడా జులై నెలలో డీల్స్ భారీగా తగ్గిపోయాయి. ఐతే ఇదే సరళి ప్రస్తుత ఆగష్టు లో కూడా కొనసాగుతుందా... లేదా మెరుగైన డీల్స్ జరుగుతాయా అన్నది మాత్రం అంచనా వేయలేకపోతున్నారు.

అప్పుడు 13... ఇప్పుడు 10...
గతేడాది జులై నెలలో మన దేశంలోని కంపెనీల్లోకి ప్రవహించిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు లేదా వెంచర్ కాపిటల్ పెట్టుబడులు అధికంగా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. అప్పుడు 13 పెద్ద స్థాయి డీల్స్ జరిగాయి. ఒక్కో డీల్ విలువ 100 మిలియన్ డాలర్లు .. అంతకంటే అధిక మొత్తం గా ఉన్నాయి. వీటన్నిటి సంయుక్త విలువ 7.1 బిలియన్ డాలర్లు గా నమోదు అయ్యింది. అదే సమయంలో ప్రస్తుత ఏడాది జులై నెలలో మాత్రం కేవలం 10 భారీ డీల్స్ జరిగాయి. అవి కూడా ఒక్కోటి 100 మిలియన్ డాలర్లు అయినప్పటికీ... వాటి మొత్తం విలువ మాత్రం 3.7 బిలియన్ డాలర్ల కె పరిమితం అయింది. అయితే ఈ ఏడాది లో మాత్రం స్థూలంగా ఇండియా లోకి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు అధికంగా రావటానికి రిలయన్స్ జియో నే ప్రధాన కారణంగా ఉంది. దాని ఇన్వెస్ట్మెంట్స్ తప్పిస్తే మొత్తం డీల్స్ విలువ తక్కువగా ఉంటుంది.

టెక్నాలజీ నెంబర్ 1.....
ఎప్పటిలాగే... ప్రస్తుత జులై మాసం లో కూడా పెట్టుబడులను ఆకర్షించడంలో టెక్నాలజీ కంపెనీలే తమ సత్తా చాటాయి. ఈ రంగానికే సింహ భాగం పెట్టుబడులు ప్రవహించాయి. ఈ సెక్టార్ లోకి సుమారు 10 డీల్స్ ద్వారా 963 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. టెక్నాలజీ తర్వాత ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలోకి అత్యధిక పెట్టుబడులు ప్రవహించాయి. 15 డీల్స్ ద్వారా ఈ రంగంలోకి మొత్తం 882 మిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. ఇక మూడో స్థానంలో ఫార్మస్యూటికల్స్ రంగం నిలించింది. 3 డీల్స్ ద్వారా ఫార్మా రంగంలోకి 699 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరాయి. కోవిడ్ -19 నేపథ్యంలో ఔషధ రంగంపై ఇన్వెస్టర్ల ఫోకస్ పెరిగిందని విశ్లేషషకులు పేర్కొంటున్నారు. ఇక మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడి తో సికోయ కాపిటల్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రథమ స్థానంలో నిలించింది.