Lumpsum calculator: లంప్‌సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారా? ఈ కాలిక్యులేటర్ వాడితే లాభాలు పక్కా!
మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఒకేసారి పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆ డబ్బు కొన్ని ఏళ్ల తర్వాత ఎంత అవుతుంది? మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అద్భుతమైన సాధనమే లంప్‌సమ్ కాలిక్యులేటర్. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు దీని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్థిక ప్రణాళిక (Financial Planning) అనేది క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు లేదా రిటైర్మెంట్ వంటి పెద్ద లక్ష్యాల కోసం మనం పెట్టుబడులు పెడుతుంటాం. అయితే మన పెట్టుబడి భవిష్యత్తులో ఎంత విలువ కలిగి ఉంటుందో తెలియకపోతే సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టం. ఇక్కడే లంప్ సమ్ కాలిక్యులేటర్ (lumpsum calculator) మనకు ఎంతో సహాయపడుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఇది ఒకదిక్సూచిలా పనిచేస్తుంది.
భవిష్యత్తు విలువను ఖచ్చితంగా అంచనా వేయవచ్చు
మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తం, ఆశించిన రిటర్న్ రేటు , కాలపరిమితిని ఈ కాలిక్యులేటర్‌లో ఇస్తే చాలు.. అది తృటిలో మీ డబ్బు ఎంతవుతుందో లెక్కగట్టి చూపిస్తుంది. దీనివల్ల గాలిలో దీపం పెట్టినట్టు కాకుండా.. ఒక స్పష్టమైన అంచనాతో మీరు అడుగులు వేయవచ్చు. ఉదాహరణకు మీరు ఒక రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 10 ఏళ్ల తర్వాత అది ఎంత అవుతుందో ముందే తెలుసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్ ప్లానింగ్ సులభతరం
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారికి ఈ ఆన్‌లైన్ టూల్ ఒక వరమనే చెప్పాలి. ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్ ఫండ్లలో ఏది ఎంచుకున్నా, మీ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఎంత రిటర్న్స్ రావచ్చో ముందే పోల్చి చూసుకోవచ్చు. వివిధ రకాల ఫండ్ల పనితీరును అంచనా వేయడానికి ఇది సులభమైన మార్గం.
లక్ష్య ఆధారిత పెట్టుబడులు (Goal-based Investing)
మీకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉందనుకుందాం.. ఉదాహరణకు రిటైర్మెంట్ కోసం రూ. 50 లక్షలు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రోజు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాన్ని ఈ కాలిక్యులేటర్ స్పష్టంగా చెబుతుంది. దీనివల్ల మీ పెట్టుబడులు గందరగోళం లేకుండా, మీ అవసరాలకు అనుగుణంగా సాగుతాయి.
ఎలా లెక్కించాలి?
పెట్టుబడుల రిటర్న్స్‌ను మాన్యువల్‌గా లెక్కించడం చాలా కష్టమైన పని, పైగా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఈ కాలిక్యులేటర్ వాడటం వల్ల సమయం ఆదా అవుతుంది , ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. దీని కోసం మీకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎవరైనా సులభంగా వాడుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లు అంటే..ఉదాహరణకు Groww, Moneycontrol లేదా AMFI వంటి సైట్లలోకి వెళ్లి అక్కడ Lumpsum Calculator సెక్షన్‌కి వెళ్లి, అక్కడ మీ పెట్టుబడి మొత్తం, ఆశించిన రిటర్న్ రేటు మరియు కాలపరిమితిని నమోదు చేయడం ద్వారా దీనిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన
క్రమంగా కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల కలిగే లాభాలపై మీకు అవగాహన పెరుగుతుంది. ఇది మీలో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తుంది. మీ పెట్టుబడులు ఎలా పెరుగుతున్నాయో ట్రాక్ చేయడం వల్ల, భవిష్యత్తులో మీ వ్యూహాలను మార్చుకోవడానికి లేదా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఏదేమైనా లంప్ సమ్ కాలిక్యులేటర్ అనేది కేవలం ఒక లెక్కలు చేసే సాధనం మాత్రమే కాదు, అది మీ వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్. మీరు మొదటిసారి ఇన్వెస్ట్ చేస్తున్న వారైనా లేదా అనుభవం ఉన్న వారైనా, మీ ఆర్థిక ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఇది తోడ్పడుతుంది. సరైన ప్లాన్, స్పష్టమైన అంచనాతో అడుగు వేస్తే, ఆర్థిక స్వేచ్ఛను పొందడం అసాధ్యమేమీ కాదు.


Click it and Unblock the Notifications