ఇన్ఫోసిస్ చేతికి అమెరికా డేటా అనలిటిక్స్ కంపెనీ, రూ.915 కోట్ల డీల్..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో కంపెనీని కొనుగోలు చేస్తోంది. అమెరికాకు చెందిన డిజిటల్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ కంపెనీ, అడోబ్ ప్లాటినమ్ పార్ట్‌నర్ బ్లూ అకార్న్ ఐసీఐని రూ.915 కోట్లకు (125 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేస్తోంది. ఇన్ఫోసిస్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌లో పూర్తిస్థాయి సేవలు అందించేందుకు ఈ డీల్ ఉపకరిస్తుంది. దీంతో పాటు ఇన్ఫోసిస్ తన కస్టమర్లు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదపడుతుంది. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్, డిజిటల్ కామర్స్, అనలిటిక్స్ ద్వారా గణనీయమైన క్రాస్ టెక్నాలజీ సామర్థ్యం అందుబాటులోకి వస్తోందని తెలిపింది.

ఇన్ఫోసిస్ నోవా హల్డింగ్ ద్వారా..
ఇప్పటికే క్రియేటివ్, మార్కెటింగ్ సేవలు అందించే వాంగ్‌డూడీని ఇన్ఫోసిస్ కొనుగోలు చేసింది. ఇప్పుడు బ్లూ అకార్న్ ఐసీఐని కొనుగోలు చేయడం గమనార్హం. ఈ డీల్ 2021 మూడో క్వార్టర్ నాటికి పూర్తి కానుంది. డీల్‌లో మేనేజ్‌మెంట్ ఇన్సెంటివ్స్, బోనస్‌లు కలిపి 125 మిలియన్ డాలర్ల మేర ఖర్చు అవుతుందని అంచనా. దీనిని ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్ ఎల్ఎల్‌సీ కింద చేయనున్నారు. ఈ కంపెనీ ఇన్ఫోసిస్‌కు అనుబంధ సంస్థ.

అందుకే.. కొనుగోలు
మా ఖాతాదారుల డిజిటల్ ప్రాధాన్యతలకు సంబంధించిన సామర్థ్యాలను పెంపొందించేందుకు, అడోబ్ ఎకోసిస్టం వ్యవస్థపై తమ నిబద్దతకు బ్లూ అకార్న్ ఐసీఐ మరో మైలురాయి అని ఇన్ఫోసిస్ పేర్కొంది. సృజనాత్మకత, మార్కెటింగ్ సేవల్ని అందించే వాంగ్‌డూడీని ఇంతకుముందు కొనుగోలు చేశామని, డిజిటల్ కామర్స్ ప్రపంచంలో గ్లోబల్ సీఎంవోలు, వ్యాపారాలకు సహాయపడేందుకు బ్లూ అకార్న్ ఐసీఐ దోహదపడుతుందని తెలిపింది. ఈ కొనుగోలు ఇన్ఫోసిస్ సామర్థ్యాలను మరింత పెంచుతుందని పేర్కొంది.

వివిధ సంస్థలతో కలిసి వర్క్
బ్లూ అకార్న్ ఐసీఐ.. బ్రిజెర్ క్యాపిటల్ కంపెనీ కింద ఉంది. ఈ కంపెనీ 2019లో 43.6 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇంజినీరింగ్, డిజైన్, అనలటిక్స్, స్ట్రాటెజీ వంటిసేవలను అందించింది. మీడియా, కన్స్యూమర్ గూడ్స్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ రంగాలకు చెందిన బ్రాండ్స్‌తో కలిసి పని చేసింది.