IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. గతంలో ఎక్కువ ప్యాకేజీ కోసం ప్రతి రెండేళ్లకోసారి కంపెనీలు మారడం (Job Hopping) మనం చూశాం. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల్లో జాబ్స్ (IT jobs) పట్ల ఒక కొత్త వైఖరి కనిపిస్తోంది. దానినే నిపుణులు 'జాబ్ హగ్గింగ్' (Job Hugging) అని పిలుస్తున్నారు. అంటే కొత్త అవకాశాల కోసం వెతకడం మానేసి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్నే గట్టిగా పట్టుకుని ఉండటం.

'జాబ్ హగ్గింగ్' అంటే ఏమిటి?
చాలా మంది ఉద్యోగులు తమ ప్రస్తుత పని పట్ల పెద్దగా సంతృప్తిగా లేకపోయినా, ఎదుగుదల లేకపోయినా.. ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు లేదా కొత్త ఉద్యోగం దొరుకుతుందో లేదో అన్న భయం ఉన్నప్పుడు.. ఉన్న చోటే కొనసాగడాన్ని 'జాబ్ హగ్గింగ్' అంటారు. ఇది కేవలం బద్ధకం వల్ల వచ్చేది కాదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తీసుకుంటున్న నిర్ణయం.
ఐటీ రంగంలో ఈ మార్పుకు కారణాలేంటి?
సాఫ్ట్‌వేర్ రంగంలో (IT Industry) ఈ మార్పు రావడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి..
- ఆర్థిక అనిశ్చితి: ద్రవ్యోల్బణం, మాంద్యం భయాల వల్ల కంపెనీలు కొత్త నియామకాలను (Hiring) తగ్గించేశాయి. దీనివల్ల బయట అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
- లేఆఫ్స్ భయం: కొత్త కంపెనీలో చేరిన వెంటనే లేఆఫ్స్ జరిగితే.. 'చివరగా చేరిన వారే మొదట వెళ్ళిపోవాలి' (LIFO) అనే రూల్ వల్ల ముప్పు ఉంటుందని టెక్కీలు భయపడుతున్నారు.
- AI , ఆటోమేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భవిష్యత్తులో ఏ ఉద్యోగాలు ఉంటాయో.. ఏవి ఊడతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో సుపరిచితమైన వాతావరణంలో ఉండటమే మేలని ఉద్యోగులు భావిస్తున్నారు.
డేటా ఏం చెబుతోంది?
మోన్‌స్టర్ 2025 జాబ్ హగ్గింగ్ రిపోర్ట్ ప్రకారం.. దాదాపు 75% మంది ఉద్యోగులు 2027 వరకు తమ ప్రస్తుత కంపెనీలోనే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో 48% మంది కేవలం ఆర్థిక భయం వల్లే ఉంటున్నామని చెప్పడం గమనార్హం. గతంలో 'గ్రేట్ రెసిగ్నేషన్' సమయంలో ఉద్యోగాలు వదిలేసిన వారు, ఇప్పుడు 'జాబ్ సెక్యూరిటీ'కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
దీనివల్ల వచ్చే నష్టాలేంటి?
ఉన్న చోటే ఉండటం సురక్షితంగా అనిపించినా.. దీర్ఘకాలంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. కొత్త టెక్నాలజీలు నేర్చుకోకపోవడం వల్ల కెరీర్ స్తంభించిపోవచ్చు (Stagnation). అలాగే వేతనాల పెంపు (Appraisals) కూడా కొత్త ఉద్యోగం మారినప్పుడు వచ్చేంత ఎక్కువగా ఉండకపోవచ్చు. దీనివల్ల వృత్తిపరమైన అసంతృప్తి పెరిగి 'బర్న్ అవుట్' కు దారితీసే అవకాశం ఉంది.
యజమానులు ఏమనుకుంటున్నారు?
కంపెనీలకు మాత్రం ఈ ట్రెండ్ ఒక రకంగా లాభమే. టాలెంటెడ్ ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లకపోవడం వల్ల నియామక ఖర్చులు తగ్గుతాయి. అయితే ఉత్సాహం లేని ఉద్యోగుల వల్ల ఉత్పాదకత (Productivity), ఆవిష్కరణలు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధ్యేమార్గం ఉత్తమం
ప్రస్తుత పరిస్థితుల్లో జాబ్స్ (IT jobs) లో స్థిరత్వం వెతుక్కోవడం తప్పు కాదు. కానీ, కంపెనీ మారకపోయినా.. కంపెనీ లోపలే కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ విలువను పెంచుకోవచ్చు. స్థిరత్వంతో పాటు నిరంతర అభ్యాసం ఉంటేనే.. రేపు మార్కెట్ పుంజుకున్నప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు.


Click it and Unblock the Notifications