వేతనాల్లో భారీ వృద్ధి, సగటు జీతం పెంపు 6.4 శాతం
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది ఉద్యోగుల శాలరీ పెంపు సగటున 6.4 శాతంగా ఉండవచ్చునని విల్లీస్ టవర్స్ వాట్సన్ సర్వే వెల్లడించింది. గత ఏడాదిలో ఇది 5.9 శాతంగా ఉందని, దానితో పోల్చుకుంటే కాస్త మెరుగుపడుతుందని వెల్లడించింది. కార్పోరేట్ రంగంలో వ్యాపార పునరుద్ధరణపై ఆశావాదం పెరిగిందని, అయితే వేతన పెంపు బడ్జెట్లో మాత్రం ప్రతిబింబించడం లేదని పేర్కొంది. వేతన పెంపు బడ్జెట్ కేటాయింపుల్లో కీలక ఉద్యోగులు, ప్రతిభ కనబరిచే నిపుణులు వలస వెళ్లకుండా కాపాడుకునేందుకు కంపెనీలు పెద్దపీట వేయవచ్చునన్నారు.
ప్రతిభావంతులకు ఈ ఏడాది సగటున 20.6 శాతం వేతన పెంపు ఉండే అవకాశాలు ఉన్నాయని, అంచనా వేసింది. 2020 అక్టోబర్/నవంబర్ కాలంలో ఆన్‌లైన్ ద్వారా 130 దేశాలకు చెందిన 18,000 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించింది. భారత్‌లో సర్వే చేసిన కంపెనీల్లో 37 శాతం వచ్చే ఏడాది కాలంలో ఆదాయంపై సానుకూలంగా ఉన్నాయి. కానీ నియామకాలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది.

సర్వే వివరాల ప్రకారం హైటెక్, ఫార్మా, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, రిటైల్ రంగాల్లో దాదాపు 8 శాతం, ఆర్థిక సేవలు, తయారీ రంగాల్లో 7 శాతం, బీపీవోలో 6 శాతం, ఎనర్జీ రంగంలో 4.6 శాతం మేర వేతనాల పెంపుకు అవకాశాలు ఉన్నాయి. నియామకాల్లో వేగం పెరగాల్సి ఉందని, గతంతో పోలిస్తే కొత్త నియామకాలు అనువైన సంస్థలు 14 శాతం నుంచి 10 శాతానికి పడిపోయాయని సర్వే వెల్లడించింది.