అమరావతి.. కాగితాల మీద నుంచి బయటకు వస్తోందా, అసలు అక్కడేం జరుగుతోంది..?
Amaravati 2.0: అమరావతి..ఆంధ్రుల కలల రాజధాని నేటికీ కాగితాల పైనే ఉంది. కృష్ణానది ఒడ్డున హోయలు పోతూ ఉండే చారిత్రక నగరం అమరావతి గత దశాబ్ద కాలంగా పూర్తి స్థాయి రాజధానిగా అవతరించలేక మల్లగుల్లాలు పడుతోంది. పాలకుల నిర్లక్ష్యంతో అమరావతిని రాజకీయంగా వాడుకుంటున్నారే తప్ప దానిని ఏపీ రాజధానిగా ప్రపంచ పటంలో నిలపడానికి అడుగులు గట్టిగా పడటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటే..రాజధాని లేకుండా ఏపీ అవతరించింది. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా నిర్ణయించింది నాటి కేంద్ర సర్కారు.
2014లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి సీఎంగా చంద్రబాబు నాయుడు నియమితులయ్యారు. సీఎం కాగానే హైదరాబాద్ నగరం కంటే గొప్ప రాజధానిని నిర్మిస్తానని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏపీ రాజధాని ఉంటుందని ప్రకటించారు. అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా నిర్మాణం చేయలేకపోవడం.. తర్వాత ఎన్నికల్లో జగన్ రావడం చకచకా జరిగిపోయాయి.

రాజధాని పనులకు జాప్యం ఎక్కడంటే.. : ఏపీకి రెండో సీఎంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంశంతో పాలన సాగించడంతో అమరావతి ప్రాజెక్టు నిలిచిపోయింది. అలా 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇద్దరు సీఎంలు మారినా ఏపీ రాజధానిగా అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. ఇక తిరిగి 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి అమరావతి రాజధాని పనులు ప్రారంభించారు.
ప్రధాని మోదీ మళ్లీ రీలాంచ్ : 2015 అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ చేతుల మీదగానే మళ్లీ రాజధాని పనులను తిరిగి ప్రారంభించారు. అమరావతి రాజధాని( Amaravathi capital ) పనులతో పాటు రూ.58000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.వీటిలో రూ.49,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమరావతిలో చేపడతారు.మరో 8 వేల కోట్ల విలువైన మొత్తం 18 కేంద్ర ప్రాజెక్టులకు మోదీ శంఖుస్థాపన చేశారు.
అమరావతి ఈ సారైనా పూర్తిగా పట్టాలెక్కుతుందా : ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా పునరుత్పాదక విద్యుత్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఏపీ సర్కారు భావిస్తోంది. రూ. 65,000 కోట్ల విలువైన 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని లక్ష్యంగా చేసుకుని.. 217 కిలోమీటర్ల విస్తీర్ణంలో కృష్ణా నది ఒడ్డున అత్యంత ప్రణాళికతో ప్రజల రాజధానిని నిర్మించాలని చూస్తోంది ఏపీ సర్కారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య దాదాపు 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి రాజధాని ప్రాంతం విస్తరించి ఉంది.
సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇంకా అలాగే ఉంది: 29 గ్రామాలలో విస్తరించిన ఉన్న అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలను పూర్తి స్థాయిలో నిర్మించాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. డిసెంబర్ 2014న సింగపూర్‌తో భాగస్వామ్యంతో రూపొందించబడిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. సింగపూర్‌కు చెందిన జురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన మాస్టర్ ప్లాన్‌ల ప్రకారం చూసినట్లయితే.. ప్రస్తుతం రాజదాని 300,000 మంది నివాసితులకు వసతి కల్పిస్తుండగా.. 2050 నాటికి 13.5 మిలియన్ల మందికి నిలయంగా ఉంటుందని చెబుతోంది.
ఇకపోతే రూ. 65,000 కోట్ల వ్యయంతో రాజధానికి తిరిగి ఊపిరిపోయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.77,250 కోట్లతో వివిధ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే రూ.49,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ : దేశంలోనే ప్రప్రథమంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో ఏర్పాటు కానుంది. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ టవర్ దేశానికే తలమానికంగా నిర్మిస్తున్నట్లు, అమెరికా సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేక గుర్తింపు పొందాలే ప్రణాళికలు రచించారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐకి ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ దారి చూపేలా రూపొందిస్తున్నారు.అలాగే ఐటీ, ఫార్మా, ఆగ్రో, హెల్త్, యూనివర్సిటీలు, కాలేజీలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, ఇన్నోవేటర్లను రాజధానికి ఆహ్వనించనుంది ఏపీ ప్రభుత్వం.
2027 నాటికి తొలి దశ పూర్తి : ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌ను రెండు దశలుగా పూర్తి చేయనున్నారు. 2025-27 మొదటి దశగా, 2027-2030 రెండవ దశగా చేపడతారు. మొదటిదశలో మౌలిక వసతుల కల్పన, ఎడ్యుకేషన్-రీసెర్చ్, పైలెట్ ప్రోగ్రాంలు, రెండో దశలో గ్లోబల్ లీడర్‌షిప్‌గా ఏపీ ఎదగడం, వాణిజ్యం, ఎగుమతి సామర్ధ్యం పెంపొందించుకోవడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఈ మిషన్‌కు వచ్చే 5 ఏళ్లలో .4,000 కోట్లు ఖర్చు చేయనుంది ఏపీ సర్కారు. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌కు ఐబీఎం సారథ్యం వహిస్తుంది.
ప్రధానంగా కేంద్ర ప్రాజెక్టులపై ఫోకస్ : కృష్ణా జిల్లాలోని నాగాయలంక వద్ద ఉన్న క్షిపణి పరీక్షా శ్రేణి, విశాఖపట్నంలోని మధురవాడలోని ఏక్తా మాల్ నిర్మించనున్నారు. 1,000 కి.మీ తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని, ప్రతి 50 కి.మీ.కు ఒక ఓడరేవు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించేలా ప్రణాళిక రచించారు. నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్ ప్రాజెక్టును రూ. 3,500 కోట్ల అంచనాతో నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
2025 నాటికి 20 లక్షల రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనను అమలు కోసం కేంద్రాన్ని ఇప్పటికే కోరారు సీఎం చంద్రబాబు. రూ.80,112 కోట్లతో నిర్మించనున్న పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో పాటు 200 టిఎంసిల మిగులు గోదావరి వరద నీటిని కరువు పీడిత రాయలసీమకు జలాశయాలు, లిఫ్ట్ ఇరిగేషన్, నల్లమల కొండల ద్వారా సొరంగాల ద్వారా మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. అలాగే శ్రీజ మిల్క్, మదర్ డెయిరీ ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నాయి, 8,000 ఉద్యోగాలు రానున్నాయి.
ఏపీలో ఢిపెన్స్ కారిడార్ : ఏపీని ఢిపెన్స్ కారిడార్ చేసే లక్ష్యంలో భాగంగా ఐదు ప్రత్యేక ఏరోస్పేస్, రక్షణ మండలాల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసింది. క్షిపణి, మందుగుండు సామగ్రి ఉత్పత్తి కోసం జగ్గయ్యపేట-దొనకొండ వద్ద ఆరు వేల ఎకరాల్లో నిర్మాణం తలపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇక పౌర, సైనిక విమానాలు, ఎలక్ట్రానిక్స్ కోసం లేపాక్షి-మడకశిర దగ్గర 10,000 ఎకరాల్లో ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక నావికా పరికరాలు, ఆయుధ పరీక్షల కోసం విశాఖపట్నం-అనకాపల్లి వద్ద 3,000 ఎకరాలు, అలాగే సైనిక డ్రోన్లు, రోబోటిక్స్, అధునాతన రక్షణ భాగాల కోసం కర్నూలు-ఓర్వకల్లు వద్ద 4,000 ఎకరాలను రెడీ చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
ప్రపంచ బ్యాంకు నిధులు,ఆరోపణలతో వెనక్కి: అమరావతికి మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు 300 మిలియన్ల డాలర్ల నిధులను ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే భూసేకరణ ప్రక్రియలలో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు, రైతు సంఘాలు లేవనెత్తిన ఆందోళనలతో 2019లో ప్రపంచ బ్యాంకు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇది నిధుల కొరతకు దారి తీయడమే కాకుండా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని భారీగా దెబ్బతీసింది.
ఈ ఆరోపణలతో ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకుతో సహా ఇతర ప్రపంచ సంస్థలు కూడా అమరావతి ప్రాజెక్టుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి.2024లో NDA సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రపంచ బ్యాంకు కార్యనిర్వాహక డైరెక్టర్ల బోర్డు అమరావతి అభివృద్ధికి మద్దతుగా 800 మిలియన్ల డాలర్ల నిధులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది.
కొత్త సవాళ్లు: ఇప్పుడు అమరావతి కొత్త సవాళ్లను ఎదుర్కుంటోంది. అమరావతి విస్తరణ ప్రాజెక్టుల కోసం రాష్ట్రం మరో 40,000 ఎకరాలను అదనంగా సేకరించాలని ప్రతిపాదించింది. అయితే రాజధానికి ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ పథకం కింద 34 వేల ఎకరాలను సేకరించింది ఏపీ ప్రభుత్వం. ఈ సారి సేకరణలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఇతర అభిృద్ధి కార్యకలాపాలు ఉంటాయని, లాజిస్టిక్స్ హబ్‌గా మార్చే లక్ష్యంతో భూములు సేకరిస్తున్నామని చంద్రబాబు సర్కారు చెబుతోంది.
అయితే మళ్లీ భూసేకరణలపై రైతుల నుంచి నిరసనలు, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణాల గురించి పర్యావరణ ఆందోళనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తక్షణ పనుల కోసం రూ.11,467 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అభివృద్ధిని వేగవంతం చేసేందేకు అంతర్జాతీయంగా సంస్థలతో చర్చలు జరుపుతోంది. 2017 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది.
కాగా అమరావతి ఒకప్పటి బ్రిటిష్ వ్యాపార కేంద్రం చెన్నై కంటే ఆరు రెట్లు పెద్దది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచింది. పూర్తి స్థాయి రాజధానిగా అందుబాటులోకి వస్తే..భారతదేశంలో గాంధీనగర్, చండీగఢ్, భువనేశ్వర్, న్యూ రాయ్‌పూర్ తర్వాత ఐదవ ప్రణాళికాబద్ధమైన రాజధానిగా అమరావతి నిలుస్తుంది. మరి చంద్రబాబు తన పదవీ కాలంలో రాజధానిని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.