ఉద్యోగులకు శాలరీ పెంపు, ఫ్రెషర్స్‌ను తీసుకుంటాం: HCL టెక్నాలజీస్
ఉద్యోగులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ3 స్థాయి వరకు ఉద్యోగులకు అక్టోబర్ 1వ తేదీ నుండి శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ4 ఆ పైన ఉద్యోగులకు మాత్రం జనవరి 1 నుండి వేతన పెంపు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు ఒక క్వార్టర్‌కు మాత్రమే ఇంక్రిమెంట్లు నిలిపివేసినట్లు తెలిపారు. వేతన పెంపు కూడా గతేడాది తరహాలో ఉంటాయని వెల్లడించారు.

ఫ్రెషర్స్‌ను తీసుకుంటాం
టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్న విషయం తెలిసిందే. హెచ్‌సీఎల్ టెక్ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలు కూడా అంచనాలు మించాయి. ఐటీ సేవల సంస్థలు కరోనా పరిస్థితుల్లోను మంచి ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేస్తున్నాయి. తాజాగా హెచ్‌సీఎల్ టెక్ వేతన పెంపును ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 12,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకుంటామని హెచ్‌సీఎల్ ప్రకటించింది. మొదటి, రెండో క్వార్టర్‌లో 3వేల మందిని తీసుకున్నామని, మిగతా క్వార్టర్‌లలో 9వేల మందిని తీసుకంటామని తెలిపింది.

1,53,085 మంది ఉద్యోగులు
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 1,53,085 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆట్రిషన్ (ఉద్యోగుల వలస) 12.2 శాతంగా నమోదయింది. గత ఏడాది భారత్‌లోని సిబ్బందికి 6 శాతం వేతనాలు, విదేశాల్లోని సిబ్బందికి 2.5 శాతం వేతనాలు పెంచింది హెచ్‌సీఎల్ టెక్. కాగా, గత నెలలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఐటీసీని దాటి 10వ స్థానానికి ఎగబాకింది.

మధ్యంతర డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ తమ వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. అంతకుముందు క్వార్టర్‌లో రూ.2 ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ డీల్స్ ఆల్ టైమ్ హైకి చేరుకున్నట్లు సీఈవో ప్రకటించారు. ఈ క్వార్టర్‌లో హెచ్‌సీఎల్ 15 డీల్స్ దక్కించుకుంది. హెచ్‌సీఎల్ 1, 2 , 3 మోడ్‌లలో మోడ్ వన్ 4.3 శాతం వృద్ధిని, మోడ్ టూ 6.9 శాతం వృద్ధిని, మోడ్ త్రీ 2 శాతం వృద్ధిని నమోదు చేసింది.