ఫ్యూచర్ రిటైల్-రిలయన్స్ డీల్, అమెజాన్ ప్లాన్
ఢిల్లీ: ఎలాంటి వాటాలు తీసుకోకుండానే ఫ్యూచర్ రిటైల్‌పై నియంత్రణ సాధించాలని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చూస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని అతిపెద్ద రిటైల్ కొనుగోలు ఒప్పందం రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని భావిస్తున్నారు.
కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌లో నమోదు కాని ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో అమెజాన్ రూ.1,430 కోట్లతో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదైన ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలు చేసే హక్కుతో అమెజాన్ ఒప్పందం చేసుకుంది.
మల్టీ బ్రాండ్ రిటైలర్లపై విదేశీ యాజమాన్యాలకు ఉన్న పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తే ఫ్యూచర్ రిటైల్‌ను సొంతం చేసుకోవాలని అమెజాన్ భావిస్తోందని అంటున్నారు. ఫ్యూచర్ రిటైల్ అప్పుల్లో కూరుకుపోవడంతో కొద్ది నెలల క్రితం రూ.24,713 కోట్లకు రిలయన్స్‌కు విక్రయించేందుకు సిద్ధమైంది. ఇది అమెజాన్‌కు రుచించలేదని అంటున్నారు.

అందుకే ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్ కూపన్స్‌కు 9.82 శాతం హక్కులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో రిలయన్స్-ఫ్యూచర్ రిటైల్ డీల్ తమ ఒప్పందాన్ని అతిక్రమించినట్లేనని అమెజాన్ చెబుతోంది. అయితే ఈ ట్రాన్సాక్షన్ పూర్తి కాకుంటే తమ సంస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ఫ్యూచర్ రిటైల్ చెబుతోంది.
కాగా, ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఫ్యూచర్ రిటైల్, అమెజాన్ వాదనలు వినిపిస్తున్నాయి. సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ ముక్తా గుప్తా నవంబర్ 12న రిటన్ పిటిషన్లు దాఖలు చేయయాలని అన్ని పార్టీలను ఆదేశించారు.