ఇంటి నుండి పని చేస్తున్నారా? అయితే మీ శాలరీలో కోత విధిస్తారు!
పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు గూగుల్ షాకిస్తోంది! ఇంటి నుండి పని చేసే ఉద్యోగులకు వేతనాల్లో 25 శాతం కోత విధించాలని భావిస్తోంది. కంపెనీ జూన్ నెలలో తీసుకు వచ్చిన వర్క్ లొకేషన్ టూల్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందట. అయితే కార్యాలయం ఉన్న నగరంలోనే పని చేసే ఉద్యోగులకు మాత్రం వేతన కోత ఉండదట. అంటే వారు అదే నగరంలో నివసిస్తూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకున్నప్పటికీ వేతన కోత ఉండదు.
సిలికాన్ వ్యాలీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియను ఇతర పెద్ద కంపెనీలు కూడా పాటిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు కూడా తక్కువ వ్యయాలు ఉండే ప్రాంతాలకు మారిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. రెడిట్, జిల్లో వంటి చిన్న సంస్థలు కూడా ప్రాంతం ఆధారిత చెల్లింపుల నమూనాకు మారాయి.

ఎంత దూరం ఉంటే అంత వేతన కోత
ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ తన ఉద్యోగుల కోసం ఒక కాలిక్యులేటర్‌ను అందించింది. దీని ద్వారా ఉద్యోగులు ఏ ప్రాంతానికి వెళ్తే వేతనాల్లో ఏ మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసుకోవచ్చు. తమ వేతన ప్యాకేజీలు అన్నీ ప్రాంతం ఆధారంగానే నిర్ణయిస్తామని, స్థానిక మార్కెట్లోని ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాన్నీ ఇస్తుంటామని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.
నగరాలు, రాష్ట్రాలను బట్టి వేతనాల్లో తేడాలు ఉంటాయన్నారు. సియాటెల్ కార్యాలయానికి దగ్గరలో ఉండే గ్రామీణ ప్రాంతానికి మారిన ఉద్యోగులకు 10 శాతం మేర కోత ఉండవచ్చునని వర్క్ లొకేషన్ టూల్ ఆధారంగా తెలుస్తోంది. దీంతో 2 గంటల ప్రయాణం ఉన్నా సరే ఆఫీస్‌కు వెళ్లడం మంచిదని ఉద్యోగులు భావిస్తున్నారట.

వారికి 25 శాతం కోత
గూగుల్ ఉద్యోగులతో పాటు ఇతర టెక్ కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే వేతనాల్లో కోత ఉంటోంది. సియాటెల్, బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లోని ఉద్యోగుల వేతనాల్లో ఐదు శాతం నుండి పది శాతం కోత విధిస్తున్నారు. శాన్‌ప్రాన్సిస్కో కార్యాలయానికి దూరమై వర్క్ ఫ్రమ్ హోమ్ ఉపయోగించుకుంటున్న వారికి 25 శాతం వేతన కోత ఉంటోంది. సిలికాన్ వ్యాలీలో ఉంటున్న వారికి శాలరీ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంది.

న్యూయార్క్ సిటీలో అయితే..
గూగుల్ ఇంటర్నేషనల్ శాలరీ కాలిక్యులేటర్ ప్రకారం న్యూయార్క్ సిటీలో (NYC)లో నివసించే గూగుల్ ఉద్యోగి స్థానిక నగరంలోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎలాంటి వేతన కోత ఉండదు. అదే సమయంలో ఓ ఉద్యోగి స్టాంఫోర్డ్, కనెక్టికట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే (ఇక్కడి నుండి న్యూయార్క్ నగరానికి గంట ప్రయాణం) వేతన కోత 15 శాతం ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు వివిధ వేతన కోతలు ఉంటాయని గూగుల్ అధికార ప్రతినిధి కూడా స్పష్టం చేశారు.
ఈ కొత్త పే-ఔట్ మోడల్ పైన గూగుల్ ఉద్యోగులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది బాగుందని కొందరు అంటుంటే, బాగాలేదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కొత్త వేతన నిబంధనలు కంపెనీలు ఉద్యోగులను వెలుపలి నుండి నియమించుకోవడానికి ఉపకరిస్తాయి. ప్రయాణాలను తగ్గించడం వంటి వాటికి ఉపకరిస్తాయి.