రెండో రోజు క్షీణించిన బంగారం ధర: మద్దతు ధర, నిరోధకస్థాయి..
బంగారం ధరలు వరుసగా రెండో రోజు క్షీణించాయి. అయితే ఇటీవల స్వల్పంగా మాత్రమే క్షీణించాయి. కొద్ది సెషన్‌ల క్రితం రూ.46,000 దిగువన పలికిన గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 దిశగా కనిపించింది. కానీ అంతలో మళ్లీ తగ్గుదల లేదా స్థిరంగా కనిపిస్తోంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (అక్టోబర్ 6, బుధవారం) రూ.173.00 (-0.37%) క్షీణించి రూ.46584.00 వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.160.00 (-0.34%) క్షీణించి రూ.46738.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,000కు కాస్త అటు ఇటు కదలాడుతోంది.
గతవారం రూ.60,000 దిగువకు పడిపోయిన సిల్వర్ ఫ్యూచర్స్ ఈ వారం పెరిగింది. నేటి ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.402.00 (-0.66%) క్షీణించి రూ.60584.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.375.00 (-0.61%) తగ్గి రూ.61079.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్షీణించినప్పటికీ, 1750 డాలర్లకు పైనే ఉంది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 8.80 (-0.50%) డాలర్లు తగ్గి 1,752.10 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.198 (-0.88%) డాలర్లు క్షీణించి 22.410 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

డాలర్ బలపడుతోంది అందుకే
ఇటీవల డాలర్ బలపడుతోంది. అలాగే, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ఇది బంగారం ధరల పైన ప్రభావం చూపుతోంది. అమెరికా నాన్-ఫామ్ పేరోల్స్ డేటా ఈ వారం బయటకు రానుంది. దీంతో గోల్డ్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. దీంతో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.3 శాతం క్షీణించి, 1,755.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 2021లో డాలర్ ఆల్ టైమ్ గరిష్టం వద్ద క్లోజ్ అయింది.
బెంచ్ మార్క్ యూఎస్ టెన్ ఇయర్ యీల్డ్స్ గరిష్టానికి చేరుకున్నాయి. ఇది గతవారం మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. పసిడి ధరలు ఈ వారం అస్థిరంగా ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలర్ మళ్లీ క్షీణించే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రభావం పడి బంగారం ధరలు కాస్త పెరగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ద్రవ్యోల్భణ ఆందోళనలు
అమెరికా ట్రెజరీ యీల్డ్స్ స్థిరంగా ఉన్నందున బంగారం ఓ సమయంలో వన్ వీక్ గరిష్టాన్ని తాకిందని, అయితే ద్రవ్యోల్భణ ఆందోళనలు బంగారం ధరలను 1750 డాలర్ల వద్ద దాదాపు స్థిరంగా ఉంచాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఇన్వెస్టర్లు రాబోయే జాబ్ డేటా నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు చెబుతున్నారు.
బంగారం సమీప భవిష్యత్తులో 1742 నుండి 1774 డాలర్ల మేర ట్రేడ్ కావొచ్చునని మైగోల్డ్ కార్డ్ డైరెక్టర్ విదిత్ గార్గ్ అంటున్నారు. మరో మెటల్ వెండి ఔన్స్ స్పాట్ ధర 0.9 శాతం క్షీణించి 22.46 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. జాబ్ డేటాతో పాటు ఫెడ్ పాలసీ ఔట్ లుక్ పైన కూడా దృష్టి సారించారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అమెరికా సేవా-రంగ కార్యకలాపాలు, ముడి చమురు, సహజవాయువు వంటి అంశాలు ఫెడ్ రిజర్వ్ బాండ్ కొనుగోలు తగ్గింపుకు సంకేతాలు ఇస్తున్నాయి.

మద్దతు ధర
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1740 డాలర్లు, నిరోధకస్థాయి 1770 డాలర్లు, ఎంసీఎక్స్ గోల్డ్ డిసెంబర్ మద్దతు ధర రూ.46500, నిరోధకస్థాయి రూ.46900. రూ.47300 టార్గెట్ ధరతో రూ.46,850 వద్ద బంగారాన్ని కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రూ.46200 టార్గెట్ ధరతో రూ.46500 వద్ద విక్రయించవచ్చునని సూచిస్తున్నారు.