తక్కువ సమయంలోనే గమ్యస్థానాన్ని చేరవచ్చు, పైగా ఈ మధ్య టిక్కెట్లు కూడా చౌక ధరలకే లభిస్తున్నాయని.. విమానయానం చేద్దామని అనుకుంటున్నారా? ఆలోచన మంచిదే కానీ, మీరు టిక్కెట్ బుక్ చేసుకున్న రోజు అసలు ఆ విమానం బయలుదేరుతుందో? లేదో? ఒకవేళ బయలుదేరినా.. నిర్ణీత సమయానికే బయలుదేరుతుందన్న నమ్మకం లేదు.
అవును, చౌక విమానయాన సంస్థలైన ఇండిగో, గో ఎయిర్ విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఇటీవలి కాలంలో తరచూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి. గత వారం హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి కొచ్చి వెళ్లాల్సిన గో ఎయిర్ విమాన సర్వీసు అర్థాంతరంగా రద్దు అవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

సర్వీసుల రద్దుకు కారణాలు అనేకం...
విమాన సర్వీసుల రద్దుకు చాలా కారణాలు ఉన్నాయని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పైలెట్ల కొరత, అనుకోకుండా ఎదురయ్యే సాంకేతిక సమస్యలతోపాటు ఇతరత్రా సమస్యల కారణంగా ఇలా హఠాత్తుగా విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వస్తున్నట్లు అవి పేర్కొంటున్నాయి. సాధ్యమైనంత వరకు ప్రయాణికులకు ఇబ్బంది ఎదురవకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని, కొన్నిసార్లు ఆలస్యం భరించలేక ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారని అంటున్నాయి.

వేధిస్తోన్న పైలెట్ల కొరత...
ప్రస్తుతం దేశంలోని పలు విమానయాన సంస్థలు 650కిపైగా విమానాలను నడుపుతున్నాయి. వీటిని నడిపేందుకు 8 వేల మంది పైలెట్లు అందుబాటులో ఉన్నారు. అయినప్పటికీ పలు విమానయాన సంస్థలు పైలెట్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. పైలెట్లు అందుబాటులో లేక పలు విమానయాన సంస్థలు ఆఖరి నిమిషంలో తమ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నాయి. గో ఎయిర్ సంస్థలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ పైలెట్ల కొరత ఇప్పట్లో తీరేలా కూడా కనిపించడం లేదు.

ఎందుకీ కొరత అంటే...
ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిర్ణీత పని గంటల అనంతరం పైలెట్లకు విశ్రాంతి అవసరం. ఈ విషయంలో పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) కాస్త కఠినంగానే ఉంది. పైలెట్లకు విశ్రాంతి నిబంధనలను అది తప్పనిసరిగా అమలు చేస్తోంది. దీంతో ఉన్న పైలెట్లతో ఎక్కవ సమయంపాటు పనిచేయించుకునే అవకాశం విమానయాన సంస్థలకు లేకుండా పోయింది. మరోవైపు భారతీయ పైలెట్లకు ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. దేశీయ విమానయాన సంస్థలతో పోలిస్తే ఈ దేశాల విమానయాన సంస్థలు వీరికి అత్యధిక జీతభత్యాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో కొంత మంది భారతీయ పైలెట్లు అక్కడి విమానయాన సంస్థల్లో చేరడం వల్ల కూడా దేశీయంగా కొరత ఏర్పడుతోంది.

వాతావరణ ప్రతికూలత...
ప్రస్తుతం ఉత్తర భారతాన్ని చలి గడగడలాడిస్తోంది. ఢిల్లీ సహా పలు విమానాశ్రయాలను దట్టమైన పొగ మంచు కప్పేస్తోంది. ఫలితంగా ఆయా విమానాలు రన్‌వేలపై దిగడం, టేకాఫ్ తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో పలు విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. కొన్నిసార్లు ఆయా విమానాశ్రయాలకు రావలసిన విమానాలను వాతావరణ ప్రతికూలత వల్ల దారి మల్లిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాల్సిన కొన్ని విమానాలను పొగమంచు కారణంగా సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. జనవరి ఆఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

సాంకేతిక సమస్యలు...
విమానాల్లో హఠాత్తుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడం వల్ల కూడా అవి తరచూ రద్దు అవుతున్నాయి. ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాల్లోని ప్రాట్ అండ్ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజిన్లలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలతో ఈ ఇంజన్లు మొరాయిస్తున్నాయి. దీంతో ఈ విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఆ సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రయాణికుల కోసం మరో విమానాన్ని అందుబాటులోకి తీసుకురావటంలో విమానయాన సంస్థలు కూడా విఫలం అవుతున్నాయి.

రద్దీకి అనుగుణంగా విమానాలు లేక...
ఈ మధ్య కాలంలో విమానాల్లో ప్రయాణించే వారు అధికమయ్యారు. ఇటు దేశీయ, అటు విదేశీ ప్రయాణాల టిక్కెట్లు సైతం చౌక ధరలకే లభిస్తుండడంతో రద్దీ బాగా పెరిగిపోయింది. మరోవైపు ప్రయాణికుల రద్దీకి సరిపడా విమానాలు లేవు. దీంతో భారత్‌కు చెందిన పలు విమానాయాన సంస్థలు విమానాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నాయి. ఎయిర్‌బస్ ఎ320 నియో, బోయింగ్ కంపెనీ బీ737 మాక్స్ విమానాల సరఫరా కోసం భారీగా ఆర్డర్లు కూడా ఇచ్చాయి. అయితే ఈ రకం విమానాల్లో ఇటీవల పలు సాంకేతిక సమస్యలు వెలుగుచూశాయి. దీంతో వాటిని తయారు చేసిన కంపెనీలు ఆ లోపాలను సరిదిద్దే పనిలో పడ్డాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా విమానాలను సరఫరా చేయలేని పరిస్థితిలో పడ్డాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications