గూగుల్ క్లౌడ్, జియో ద్వారా చాలా వేగంగా ఇంటర్నెట్: సుందర్ పిచాయ్
భారతీయుల కోసం తయారు చేసిన జియో ఫోన్ నెక్స్ట్ అల్ట్రా అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్ అని అల్పాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్ క్లౌడ్, జియో మధ్య కుదిరిన 5G భాగస్వామ్యంతో, 100 కోట్ల మందికి పైగా భారతీయులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ చేరువకావడంతో పాటు వ్యాపారాల డిజిటలైజేషన్‌కు వీలు అవుతుందన్నారు. తదుపరి దశ డిజిటైజేషన్‌లోకి భారత్ మారడానికి ఇది పునాది వేస్తుందన్నారు. గూగుల్ గత ఏడాది జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ రిటైల్ వ్యాపారాల్లో గూగుల్ క్లౌడ్ మౌలిక వసతులను వినియోగిస్తారు.

జియో ఫోన్ ధర కీలకమే
దాదాపు 30 కోట్ల మంది యూజర్లకు చేరువయ్యేందుకు చౌక స్మార్ట్ ఫోన్ రిలయన్స్‌కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే, అంతిమంగా ధర, పనితీరు కీలకంగా ఉంటుందని అంటున్నారు. కరోనా మహమ్మారికి పూర్వం భారత మార్కెట్లో రూ.5,000 పైగా ధర ఉన్న స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ వాటా ఐదు శాతం ఉంటుందని అంచనా. రూ.5,000 లోపు సెగ్మెంట్‌పై ఏ సంస్థ పెద్దగా పట్టు సాధించలేదని అంటున్నారు.

భారత్ నుండి ప్రపంచానికి..
దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2G సేవలను వినియోగిస్తున్నారు. అధిక ఛార్జీలకు కారణమవుతున్న 2G విముక్త దేశంగా భారత్‌ను మార్చాలంటే అత్యంత చౌక 4G స్మార్ట్‌ఫోన్ అవసరమని, ఇందుకు గూగుల్‌తో కలిసి జియో ఫోన్ నెక్స్ట్‌ను తీసుకు వస్తున్నామని ముఖేష్ అంబానీ నిన్నటి రిలయన్స్ 44వ వార్షిక సాధారణ సమావేశంలో చెప్పారు.
ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పైన పని చేస్తుందని, వాయిస్ అసిస్టెంట్, భాష అనువాదం, తెర మీద ఉన్న అక్షరాలను ఆటోమేటిక్‌గా చదవడం, స్మార్ట్ కెమెరా వంటివి ఈ ఫోన్‌లో ఉంటాయని, ఒక అంతర్జాతీయ దిగ్గజం, దేశీయ టెక్నాలజీ కంపెనీ కలిసి తీసుకు వస్తున్న ఈ ఫోన్‌ను తొలుత భారత్‌లో, ఆ తర్వాత మిగతా ప్రపంచానికి అందిస్తామన్నారు.

వేగవంతమైన ఇంటర్నెట్
2G కస్టమర్లకు అనువైన ధరలో, వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం లభించేలా, గూగుల్, జియో కలిసి అభివృద్ధి చేసే నెక్స్ట్ జనరేషన్ ఫోన్ ఉండాలని గూగుల్ సీఈఓ, తాను నిర్ణయించుకున్నామని, ఈ ఫోన్ కోసమే ప్రత్యేకంగా ఆప్టిమైజ్డ్ వర్షన్ ఆండ్రాయిడ్ OSను తయారు చేసినట్లు తెలిపారు. దేశంలో పూర్తిస్థాయి 5G సేవలను తొలుత మేమే అందిస్తామని ముఖేష్ అంబానీ అన్నారు.