ఢిల్లీ హైకోర్టులో ఫ్యూచర్ గ్రూప్‌కు ఊరట, అమెజాన్‌కు నోటీసులు
రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ఒప్పందానికి సంబంధించి ముందుకు వెళ్లరాదని ఫ్యూచర్ రిటైల్‌కు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ జారీ చేసిన ఆదేశాలపై అదే కోర్టు ఉన్నత ధర్మాసనం సోమవారం స్టే విధించింది. అలాగే ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ, ఇతరుల ఆస్తుల్ని జప్తు చేయాలన్న ఉత్తర్వులను కూడా నిలిపివేసింది. ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లిన అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ మార్చి 18న ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ డీఎన్ పటేల్, జస్మీత్ సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.
ఏం జరిగిందంటే?
సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేషన్ ఆదేశాలను సమర్థిస్తూ రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్ళరాదంటూ ఫ్యూచర్ రిటైల్‌కు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కూపన్స్ అదే కోర్టులో ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. నేడు విచారణకు వచ్చిన వ్యాజ్యం... ఫ్యూచర్ గ్రూప్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

అలాగే, కిషోర్ బియానీ, తదితరులు ఏప్రిల్ 28వ తేదీన ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని, వారి ఆస్తులను జప్తు చేయాలని కూడా సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశించారు. అంతేకాకుండా ఆర్బిట్రేషన్ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు మూడు నెలల పాటు జైలులో ఎందుకు నిర్బంధించకూడదో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. దీనిపై కూడా ఫ్యూచర్ గ్రూప్ అప్పీల్‌కు వెళ్లింది. ఇందులోను సానుకూలంగా తీర్పు వచ్చింది.