ఒకటే ఎంచుకోవాలి: గుత్తాధిపత్యం, అలీబాబాకు చైనా ప్రభుత్వం మరో షాక్
బీజింగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాపై గుత్తాధిపత్య అనుమానిత దర్యాఫ్తును చేపడుతున్నట్లు చైనా నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. వేగవంతంగా వృద్ధి చెందుతున్న సాంకేతిక పరిశ్రమలను అదుపులో ఉంచాలనే అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నాల్లో భాగమే ఈ దర్యాఫ్తు అని చెబుతున్నారు. అలీబాబాతో పాటు వియ్-చాట్ మెసేజింగ్ సేవలు అందించే టెన్సెంట్ హోల్డింగ్స్ గుత్తాధిపత్యంపై కూడా ప్రభుత్వం ఆందోళనగా ఉంది. జాక్ మా నేతృత్వంలోని అలీబాబాకు ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు.

గతంలోను..
అంతకుముందు, జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ కంపెనీ ప్రపంచంలో 35 బిలియన్ డాలర్ల అతిపెద్ద ఐపీవోకు సిద్దమైన సమయంలో ప్రపంచ మార్కెట్లు అటువైపు ఆసక్తిగా చూశాయి. యాంట్ గ్రూప్‌లో అలీబాబా గ్రూప్‌కు మూడో వంతు వాటా ఉంది. ఈ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి చైనా అధికారులు గత నెలలో షాకిచ్చారు. హాంగ్‌కాంగ్, షాంఘైలలో లిస్టింగ్‌కు కంపెనీలు సన్నాహాలు చేస్తున్న సమయంలో చైనీస్ బ్యాంకులపై జాక్ మా వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఐపీవోకు అధికారులు చెక్ చెప్పడంతో పాటు, అలీబాబా గ్రూప్ స్టాక్స్ కుప్పకూలాయి. ఆ తర్వాత ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది చైనా ప్రభుత్వం. దీంతో అలీబాబా స్టాక్స్ హాంగ్‌కాంగ్‌లో ప్రారంభ ట్రేడ్‌లో నష్టపోయాయి.

ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా..
ప్రత్యర్థి ప్లాట్‌ఫాంను ఎంచుకోలేని విధంగా వ్యాపారుల ముందు అలీబాబా గ్రూప్ ఓ ప్రతిపాదనను చేయడంపై కూడా రెగ్యులేటర్స్ ఇదివరకే హెచ్చరించారు. దీని ప్రకారం వ్యాపారులు ప్లాట్‌ఫాంలలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. ఇందుకు సంబంధించి వ్యాపారులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి విధానం ద్వారా ప్రత్యర్థుల ప్లాట్‌ఫాంలలో వ్యాపారులు ఉత్పత్తులు అందుబాటులో ఉంచకుండా చేసింది. దీనిపై రెగ్యులేటర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై దర్యాఫ్తు ప్రారంభించినట్లు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ తెలిపింది.

గుత్తాధిపత్య వ్యతిరేక చర్యలు
రెగ్యులేటర్ నుండి నోటీసులు అందినట్లు యాంట్ గ్రూప్ తెలిపింది. అలీబాబా ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. ఆన్ లైన్ బ్యాంకింగ్‌లోకి విస్తరిస్తున్న ప్రయివేటు రంగ కంపెనీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని చైనా నియంత్రణ సంస్థలు భావిస్తున్నాయి. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యలు అత్యవసర అంశంగా మారిందని అధికర పార్టీ పత్రిక పేర్కొంది.