మూడు కేటగిరీల్లో బ్యాంక్ హాలిడేస్: సెప్టెంబర్ సెలవుల కంప్లీట్ లిస్ట్ ఇదే
ముంబై: ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయిపోయాయి. బ్యాంకులు, ఏటీఎంలను సందర్శించని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో బ్యాంకులు, ఏటీఎం సేవలను వినియోగించుకుని ఉంటారంటూ కొన్ని సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి. తమ నగదు మొత్తాలను భద్రపరచుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీస్ తప్ప మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేదు. ఫలితంగా ప్రజల దైనందిన జీవితంలో అవి కీలక పాత్ర పోషిస్తోన్నాయి.
తెరపై కొత్త వాహన రిజిస్ట్రేషన్ సిరీస్: డీటెయిల్స్ ఇవే

ప్రతినెలా చివరి వారంలో సెలవుల లిస్ట్..
అలాంటి బ్యాంకులు ఒక్క రోజు మూత పడినా వందల కోట్ల రూపాయల మేర కార్యకలాపాలు స్తంభించిపోతుంటాయి. సాధారణ సెలవు రోజులను మినహాయిస్తే.. సమ్మెలు, బంద్‌లల్లో దీని తీవ్రత అధికంగా కనిపిస్తుంటుంది. ఇదిలావుండగా- బ్యాంకుల సెలవులకు సంబంధించిన పూర్తి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెలా చివరి వారంలో జారీ చేస్తుంటుంది. ఈ సారి కూడా ఆ ఆనవాయితీని కొనసాగించింది.

మూడు కేటగిరీల్లో బ్యాంకు సెలవులు..
సెప్టెంబర్ నెల మొత్తానికీ దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవురోజులను పొందుపరిచిన కంప్లీట్ లిస్ట్‌ను విడుదల చేసింది. సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను ప్రకటిస్తుంటుంది రిజర్వు బ్యాంకు. ఒకటి- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రెండు- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, మూడు- బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్. ఈ మూడింట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంటుంది.

నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద..
నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెప్టంబర్ నెల మొత్తంగా ఏడు సెలవులు ఉంటాయి బ్యాంకులకు. ఇవి పోను- ఏ రాష్ట్రాేనికి ఆ రాష్ట్రంలో.. అక్కడి ప్రజల సంప్రదాయాలు, పండుగలు, తిథులను అనుసరించి జారీ చేసే సెలవులు అదనం. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో బ్యాంకులకు యధాతథంగా సెలవులు అమలులో ఉంటాయి. ఆదివారం కూడా పనిచేసే శాఖా కార్యాలయాలకు మినహయింపు ఉంటుంది.

రాష్ట్రాలవారీగా..
రాష్ట్రాలు, పండుగలు, తిథుల వారీగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన జాబితా ప్రకారం.. వచ్చనెలలో వచ్చే బ్యాంకుల సెలవులను పరిశీలిస్తే- సెప్టెంబర్ 5వ తేదీ- ఆదివారం. అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకేసారి అమలవుతుంది. సెప్టెంబర్ 8వ తేదీ- శ్రీమంత శంకరదేశ తిథి అస్సాంలో అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీ- తీజ్ (హరితలిక) పర్వదినం సందర్భంగా సిక్కింలో బ్యాంకులు పని చేయవు.

రెండో శనివారం..
సెప్టెంబర్ 10వ తేదీ- గణేష్ చతుర్థి/చతుర్థి పక్ష/వినాయక చవితి/వరసిద్ధి వినాయక వ్రతం పండుగ సందర్భంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్, పనాజిల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 11వ తేదీ-గణేష్ చతుర్థి రెండవ రోజు- పనాజీ (గోవా)లోని అన్ని బ్యాంకులకు సెలవును ప్రకటించింది ఆర్బీఐ. రెండో శనివారం హాలిడే కూడా ఇందులోనే కలిసిపోయింది. సెప్టెంబర్ 12వ తేదీ- ఆదివారం హాలిడే, సెప్టెంబర్ 17వ తేదీ- కర్మపూజ సందర్భంగా రాంచీ (జార్ఖండ్)లో బ్యాంకులకు హాలిడే ఉంటుంది.

కేరళ, సిక్కింలల్లో..
సెప్టెంబర్ 19వ తేదీ- ఆదివారం సెలవు. సెప్టెంబర్ 20- ఇంద్రజాత్రను పురస్కరించుకుని గ్యాంగ్‌టక్ (సిక్కిం)లో బ్యాంకులు పనిచేయవు. సెప్టెంబర్ 21- శ్రీ నారాయణగురు జీవసమాధి పొందిన రోజు కావడం వల్ల కోచి, తిరువనంతపురం (కేరళ)లో బ్యాంకులకు హాలిడేను ప్రకటించింది రిజర్వుబ్యాంక్. సెప్టెంబర్ 25వ తేదీ- నాలుగో శనివారం సెలవు. సెప్టెంబర్ 26వ తేదీ-ఆదివారం హాలిడే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఖాతాదారులు తమ కార్యక్రమాలను రూపొందించుకోవాల్సి ఉంటుందని రిజర్వ్‌బ్యాంకు సూచించింది.