షేర్ మార్కెట్లో బర్గర్ కింగ్: ఐపీఓ ఎప్పుడంటే? షేర్ వేల్యూ ఫిక్స్: రూ.810 కోట్ల సేకరణ టార్గెట్
ముంబై: ప్రముఖ చెయిన్ రెస్టారెంట్ల సంస్థ బర్గర్ కింగ్.. షేర్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. షేర్ విలువను వెల్లడించింది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) తేదీని నిర్ధారించింది. వచ్చేనెల 2వ తేదీన షేర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నట్లు తెలిపింది. అమెరికాకు చెందిన బర్గర్ కింగ్ భారతీయ షేర్ మార్కెట్లోకి ప్రవేశిస్తుండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ చెయిన్ రెస్టారెంట్లను నిర్వహిస్తోన్న కంపెనీ.. పోటీని తట్టుకుని, షేర్ మార్కెట్లో ఏ మేరకు తన పరిధిని విస్తరించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఐపీఓ బ్యాండ్ ఫిక్స్..
తన ఐపీఓ బ్యాండ్ విడ్త్‌ను బర్గర్ కింగ్ యాజమాన్యం వెల్లడించింది. ఒక్కో షేర్ విలువ 59 నుంచి 60 రూపాయల వరకు నిర్ధారించింది. బర్గర్ కింగ్ సంస్థ ప్రకటించిన ఒక షేర్‌ను కొనాలంటే.. 60 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ షేర్ ఫేస్ వేల్యూతో పోల్చుకుంటే ఈ మొత్తం ఆరు రెట్లు అధికం. వచ్చేనెల 2వ తేదీ ఈ సంస్థ షేర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. 4వ తేదీన క్లోజ్ అవుతాయి. ఈ రెండు రోజుల వ్యవధిలోనే కనీసం 810 కోట్ల రూపాయల మొత్తాన్ని సేకరించాలని కంపెనీ యాజమాన్యం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆసక్తి ఉన్న వారు 250 షేర్లను తప్పనిసరిగా కొనాల్సి ఉంటుంది.

2026 నాటికి 700 రెస్టారెంట్లు..
వచ్చే ఆరేళ్లలో అంటే.. 2026 నాటికి 700 బర్గర్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలనేది ఆ సంస్థ ప్రణాళిక. ఈ మేరకు మాస్టర్ ఫ్రాంఛైజీ అండ్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. ఈ 700 రెస్టారెంట్లలో సంస్థ సొంతంగా కొన్నింటిని నెలకొల్పుతుంది. తన సబ్ ఫ్రాంఛైజీలకు మిగిలిన వాటిని నిర్వహణ కోసం అప్పగిస్తుంది. నిజానికి- ఈ అగ్రిమెంట్ ప్రకరాం.. 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికే 700 రెస్టారెంట్లను నెలకొల్పాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరో ఏడాదికి దీని గడువును పొడిగించారు.

కోటక్ మహీంద్రా సహా..
బర్గర్ కింగ్ షేర్లను కొనుగోలు చేయడానికి కొన్ని బడా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. కోటక్ మహీంద్రా కేపిటల్ కంపెనీ, సీఎల్ఎస్ఏ ఇండియా, ఎడెల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జేఎం మోర్గాన్ ఫైనాన్సియల్ వంటి కొన్ని కంపెనీలు ఈ షేర్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐపీఓలో 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసింది కంపెనీ యాజమాన్యం. 15 శాతం వరకు నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, 75 శాతం వరకు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసింది.