రాజస్థాన్ ఆ సిటీలో రూ.100 దాటిన ఆ పెట్రోల్ ధర, నేడు బ్రెంట్ క్రూడ్ స్వల్పంగా డౌన్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న (బుధవారం జనవరి 27) పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సవరిస్తాయి. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచాయి. నిన్నటి పెరుగుదలతో ధరలు రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో పెట్రోల్ ధర లీటర్ పైన ఏకంగా రూ.100 దాటింది.
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్లో మార్పులు?

ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.101
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.100 దాటింది. ఇక్కడ ప్రీమియం పెట్రోల్ కావాలంటే రూ.101గా ఉంది. సాధారణ పెట్రోల్ రూ.98.40గా ఉంది. జనవరి 6వ తేదీ నుండి చమురు ధరలు పలుమార్లు పెరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బ్రాండెడ్ పెట్రోల్ లీటర్ రూ.89.10, ముంబైలో రూ.95.61గా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లోను పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. చమురు రంగ కంపెనీలు సవరణ ఇలాగే కొనసాగిస్తే లీటరు రూ.90 దాటవచ్చు.

ప్రీమియం, రెగ్యులర్ పెట్రోల్
రెగ్యులర్, ప్రీమియం ఇంధనాల మధ్య ముఖ్యమైన తేడా ఏంటంటే ఆక్టేన్ సంఖ్య. రెగ్యులర్ ఫ్యూయల్‌లో తక్కువ ఆక్టేన్స్ ఉంటాయి. ప్రీమియం పెట్రోల్‌లో 91 శాతం అక్టేన్ రేటింగ్ ఉంటుంది. ఆక్టేన్ సంఖ్య ఇంధనం యొక్క జ్వలన నాణ్యతను కొలవడంగా చెప్పవచ్చు. ఇక, డీజిల్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.76.23, ముంబైలో రూ.83గా ఉంది.

అంతర్జాతీయంగా ధరలు
దేశీయ చమురు రంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL)లు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు సవరిస్తాయి. జనవరి 6వ తేదీ నుండి పెట్రోల్ రూ.2.59, డీజిల్ రూ.2.61 పెరిగింది. బ్రెంట్ క్రూడాయిల్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధరలు పెరుగుతున్నాయి. అయితే నేడు మాత్రం అతి స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ 0.73 శాతం తగ్గి బ్యారెల్‌కు 55.38 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాక్ ఇంటర్మీడియేట్ 0.74 శాతం తగ్గి బ్యారెల్‌కు 52.44 డాలర్ల వద్ద ఉంది.