40% పతనమైన బిట్ కాయిన్, అమెరికాలో 35 శాతం మైనింగ్
క్రిప్టో కరెన్సీ పతనం కొనసాగుతోంది. వరల్డ్ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ నేడు 42,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లతో పోలిస్తే ఇది 27,000 డాలర్లు తక్కువగా ఉంది. అంటే ఆల్ టైమ్ గరిష్టంతో 40 శాతం పతనమైంది. బిట్ కాయిన్ నవంబర్ 2021న 69,000 డాలర్ల స్థాయికి చేరుకుంది. నేడు ఒక్కరోజు ఈ డిజిటల్ టోకెన్ దాదాపు 5 శాతం క్షీణించి 41,008కి కూడా పడిపోయింది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 3.66 శాతం లేదా 1518 డాలర్లు క్షీణించి 41,565 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
వరల్డ్ రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం సెప్టెంబర్ 30వ తేదీ ఆల్ టైమ్ గరిష్టంతో 9 శాతం మేర పడిపోయింది. ఇతర డిజిటల్ టోకెన్స్ బిట్ కాయిన్, సోలానా, కార్డానో, ఎక్స్‌పీఆర్ కూడా గత ఏడు రోజుల్లో పది శాతం చొప్పున క్షీణించాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 శాతం కంటే ఎక్కువగా తగ్గి 2.08 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది.

2021 క్యాలెండర్ ఏడాదిలో బిట్ కాయిన్ 60 శాతం మేర లాభపడింది. ఎథేరియం కూడా భారీగానే లాభపడింది. ఇక 2021లో బియాన్స్ కాయిన్ అయితే ఏకంగా 1300 శాతం లాభపడింది. యూఎస్ ఫెడ్ రిమార్క్స్ నేపథ్యంలో బిట్ కాయిన్ నెలల కనిష్టానికి పడిపోయింది.
బిట్ కాయిన్ ఈ వారం 47,000 డాలర్ల వద్ద ప్రారంభమై, ప్రస్తుతం 42,000 డాలర్లకు పడిపోయింది.
బిట్ కాయిన్ మైనింగ్‌లో ఏ దేశం ఎంతంటే?
బిట్ కాయిన్ మైనింగ్‌లో అమెరికా వాటా 35 శాతం, కజకిస్తాన్ 18 శాతం, రష్యా 11 శాతం, కెనడా 10 శాతం, ఇతర దేశాలు 26 శాతంగా ఉన్నాయి. ఇది 2021 ఆగస్ట్ నాటి జాబితా.