market crashes: భారత్ భారీ మార్కెట్ నష్టాలు, అంతర్జాతీయంగా భారీ పతనాలివే..
స్టాక్ మార్కెట్ సోమవారం (జనవరి 24, 2022) భారీగా క్షీణించింది. నిన్న ఒక్కరోజే సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు దాదాపు రూ.10 లక్షల కోట్లు నష్టపోయారు. మార్కెట్లు వరుసగా ఐదు సెషన్లు నష్టాలను చూడటంతో ఈ కాలంలో సెన్సెక్స్ 3500 పాయింట్లు నష్టపోయింది. సూచీలు ఇంతకంటే ఎక్కువగా పతనమైన ఎన్నో సందర్భాలు ఉన్నాయి.
కరోనా వైరస్ కారణంగా 2020 మార్చిలో, ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో మార్కెట్ భారీ పతనాలు నమోదు చేసింది. కొన్ని సందర్భాల్లో ట్రేడింగ్ నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. బడ్జెట్‌కు ముందు సూచీలు దిద్దుబాటుకు గురవుతున్నాయి. మార్కెట్ ప్రారంభం నుండి సెన్సెక్స్ భారీ పతనాలు చూద్దాం..

టాప్ 10 పతనాల్లో నిన్నటిది
మన దేశంలో టాప్ 10 మార్కెట్ పతనాల్లో నిన్నటిది కూడా నిలిచింది. పర్సెంటేజీ పరంగా మార్కెట్ ప్రారంభం నుండి అంతకుముందు కూడా అత్యంత పతనాలు ఉన్నాయి. అయితే పాయింట్ల పరంగా చూస్తే గత ఆరేళ్ళ భారీ పతనాలు ఇవి.
కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి 23వ తేదీన సెన్సెక్స్ 3934 పాయింట్లు పడిపోయింది.
ఇదే మహమ్మారి కారణంతో 2020, 2021లో సెన్సెక్స్ పలుమార్లు క్షీణించింది.
12 మార్చి 2020లో సెన్సెక్స్ 2919 పాయింట్లు, 16 మార్చి 2020లో 2713 పాయింట్లు, 15 మే 2020 2002 పాయింట్లు, 09 మార్చి 2020లో 1942 పాయింట్లు, 26 ఫిబ్రవరి 2021లో 1939 పాయింట్లు, 18 మార్చి 2020లో 1710 పాయింట్లు, 26 నవంబర్ 2021లో 1688 పాయింట్లు, 24 ఆగస్ట్ 2015లో 1625 పాయింట్లు పడిపోయింది. నిన్న అంటే 24 జనవరి 2022న 1546 పాయింట్లు క్షీణించింది.

అంతకుముందు...
పర్సెంటేజీ పరంగా చూస్తే అంతకుముందు కూడా భారీ పతనాలు ఉన్నాయి.
- 1982లో బెంగాల్‌కు చెందిన బేర్ కార్టెల్ ప్రధానంగా రిలయన్స్‌ను లక్ష్యంగా చేసుకొని షార్ట్ సెల్లింగ్ షేర్లను ప్రారంభించింది. దీంతో షేర్ల వ్యాల్యూ తగ్గింది. అప్పుడు బీఎస్ఈ వరుసగా మూడు రోజులు క్లోజ్ అయింది.
- హర్షద్ మెహతా స్కాం కారణంగా 28 ఏప్రిల్ 1992లో 12.77 శాతం నష్టపోయింది.
- పర్సెంటేజీ పరంగా అతిపెద్ద ఫాల్ 17 మే 2004లో చోటు చేసుకుంది. అప్పుడు 15.52 శాతం పడిపోయింది. యూపీఏ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మార్కెట్ కుప్పకూలింది.
- 18 మే 2006లో బీఎస్ఈ సెన్సెక్స్ 826 పాయింట్లు నష్టపోయింది.
- 2007లో 2 ఏప్రిల్, 1 ఆగస్ట్, 16 ఆగస్ట్, 18 అక్టోబర్, 21 నవంబర్, 17 డిసెంబర్ తేదీల్లోను భారీగా పతనమైంది.
- ఆర్థిక సంక్షోభం ప్రభావంతో 2008లో జనవరి 21న సెన్సెక్స్ 1408 పాయింట్లు పడిపోయింది. ఇదే ఏడాదిలో జనవరి 22, ఫిబ్రవరి 11, మార్చి 3, మార్చి 17, అక్టోబర్‌లో 24, నవంబర్ 26లలోను సెన్సెక్స్ కుప్పకూలింది.
- 2009లో సెన్సెక్స్ 869 పాయింట్లు నష్టపోయింది.
- 2015 ఏడాదిలో జనవరి 6, ఆగస్ట్ 24 తేదీల్లోను మార్కెట్ క్రాష్ చోటు చేసుకుంది.
- 2016లో మార్కెట్ వరుసగా పతనమైంది. ఇక 2020 నుండి కరోనా ప్రభావంతో మార్కెట్ ఉత్తానపతనాలు చూసింది.

అంతర్జాతీయ మార్కెట్...
అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే 1929లో మార్కెట్ వరస్ట్ పతనం నమోదు చేసింది. మహామాంధ్యం కారణంగా మార్కెట్ కుప్పకూలింది. 1987 బ్లాక్ మండే చూసింది. 1999-2000లో డాట్ కామ్ బబుల్ కారణంగా మార్కెట్ పతనమైంది. 2008లో ఆర్థిక సంక్షోభం, 2020లో కరోనా మహమ్మారి కారణంగా సూచీలు పతనమయ్యాయి.