ఏపీకి మోదీ సర్కారు గుడ్ న్యూస్..రూ.6,405 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్రంలోని మోదీ సర్కారు ఏపీకి శుభవార్తను అందించింది. ఏపీలో కొత్త రైల్వే కనెక్టివిటీకి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఏపీతో పాటు జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలలో రూ.6,405 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచే ఉద్దేశంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం నేడు ఈ కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులకు రైల్వే ప్రయాణం మరింతం సులభంగా మారనుంది.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.జార్ఖండ్‌లోని కోడెర్మా-బర్కకానా డబ్లింగ్, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ మధ్య బల్లారి-చిక్జాజూర్ డబ్లింగ్ రైల్వే ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 6,405 కోట్లుగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులతో భారతీయ రైల్వే నెట్‌వర్క్ 318 కి.మీ. విస్తరించనుందని.. ప్రయాణికులకు అలాగే సరుకు రవాణాకు ఇవి కీలకం కానున్నాయని మంత్రి వైష్ణవ్ వెల్లడించారు.

మొదటి ప్రాజెక్ట్ : 133 కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న కోడెర్మా-బర్కకానా (అరిగడ) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.3,063 కోట్ల వ్యయంతో కేంద్రం నుంచి ఆమోదం లభించింది. ఈ లైన్ పాట్నా- రాంచీ మధ్య అతి తక్కువ రైలు కనెక్టివిటీనీ అందిస్తుంది. జార్ఖండ్‌లోని నాలుగు జిల్లాలైన కోడెర్మా, చత్రా, హజారీబాగ్, రామ్‌గఢ్ లను కలుపుతూ ఈ రైలు కనెక్టివిటీ రానుంది. ఈ ప్రాజెక్టు లైవ్ లోకి వస్తే.. ఇది ఏటా అదనంగా 30.4 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయగలదని భావిస్తున్నారు. ఇంటర్‌సిటీ ప్రయాణం, లాజిస్టిక్స్ చాలా ఉపయోగకరంగా మారనుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 938 గ్రామాలతో పాటు దాదాపు 15 లక్షల మంది జనాభాకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుందని మంత్రి తెలిపారు. ఈ రైల్వే ప్రాజెక్ట్ లో 17 ప్రధాన వంతెనలు, 180 చిన్న వంతెనలు, 42 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 13 రోడ్ అండర్ బ్రిడ్జిలతో అనుసంధానం కానుంది. తద్వారా మౌళిక సదుపాయాల కల్పన మరింతగా మెరుగుపడనుంది.
రెండవ ప్రాజెక్ట్: బళ్లారి-చిక్జాజూర్ డబ్లింగ్ రూ. 3,342 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 185 కి.మీ.ల విస్తీర్ణంలో రానుంది. ఈ లైన్ మంగళూరు ఓడరేవును సికింద్రాబాద్ తో కలుపనుంది. ఇనుప ఖనిజం, కోకింగ్ బొగ్గు, ఉక్కు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులతో పాటుగా ఆహార ధాన్యాలు వంటి కీలక వస్తువులను తరలించడానికి ఈ లైన్ కీలకం కానుంది.
ఈ వెంచర్ కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలతో పాటుగా.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాకు కనెక్టివిటీని మరింతగా సౌలభ్యంగా మార్చనుంది.ఈ ప్రాజెక్టులో 19 స్టేషన్లు, 29 ప్రధాన వంతెనలు, 230 చిన్న వంతెనలు, 21 ROBలు, 85 RUBలతో అనుసంధానం కానున్నాయి. అలాగే 470 గ్రామాలలో సుమారు 13 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఏటా అదనంగా 18.9 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయనుంది.