Digilocker: వాట్సాప్ ద్వారా డిజీలాకర్ సేవలు
డిజిలాకర్ సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చును. మరింత పారదర్శకంగా, సరళంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచడంలో భాగంగా ప్రభుత్వం MyGov హెల్ప్ డెస్క్‌ను గతంలో ప్రారంభించింది. తాజాగా దీని ద్వారా వాట్సాప్ నుండి డిజిలాకర్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దీంతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సీబీఎస్ఈ పదో తరగతి పాసింగ్ సర్టిఫికెట్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ద్విచక్ర వాహన బీమా పాలసీ, పదో తరగతి మార్క్ షీట్, పన్నెండో తరగతి మార్క్ షీట్, బీమా పాలసీ పత్రాలు వంటి వాటిని వాట్సాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారులు చాట్‌బాట్ ద్వారా 91-9013151515 నెంబర్‌కు నమస్తే లేదా హాయ్ లేదా డిజిలాకర్ అని పంపించడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. కరోనాపై పోరాటంలో భాగంగా మార్చి 2020లో వాట్సాప్‌లో మైగవ్ హెల్ప్ డెస్క్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. గతంలో దీనిని కరోనా హెల్ప్ డెస్క్ అనేవారు. కరోనా సంబంధిత సమాచారం, వ్యాక్సీన్ అపాయింట్‌మెంట్, వ్యాక్సీన్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ వంటి సేవలను అందిస్తూ వచ్చింది. డిజిలాకర్‌లో దాదాపు పది కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు.