For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీజీ పవర్ వ్యవహారం: రూ.3 వేల కోట్ల కుంభకోణం.. ఒక్క చెక్కు బౌన్స్‌తో వెలుగులోకి...

|

ఓ కంపెనీలో ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తులు విచ్చలవిడిగా నిధులు మళ్లించారు. నిధుల మళ్లింపునకు సంబంధించి కంపెనీ నిబంధనలు కూడా పాటించలేదు. ఇలా ఎంతో కాలంగా అనేక అవకతవకలకు పాల్పడ్డారు. చివరికి ఈ కుంభకోణం విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.3 వేల కోట్లు. అయితే ఆ కంపెనీలో సాగుతున్న అవకతవకలన్నీ ఒక్క చెక్కు బౌన్స్ అవడంతో బయటపడ్డాయి. ఆ కంపెనీ పేరే.. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్.

సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కంపెనీలో చోటుచేసుకున్న ఈ కుంభకోణంపై.. ఇటీవల వైష్ అసోసియేట్స్ నిర్వహించిన దర్యాప్తులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీలోని ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తుల నిర్వాకం చూసి దర్యాప్తు సంస్థ సైతం అవాక్కయిందంటే.. అవకతవకలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. వైష్ అసోసియేట్స్ నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ప్రముఖ ఆంగ్లపత్రిక 'ది ఎకనామిక్ టైమ్స్' ప్రచురించింది. ఆ కథనం ప్రకారం...

ఇవీ ఆరోపణలు...

ఇవీ ఆరోపణలు...

సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కంపెనీలోని ఉన్నత స్థాయి వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా నిధులను మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ఈ నిధుల మళ్లింపునకు వారు కనీసం బోర్డు అనుమతులు కూడా తీసుకోలేదు. అంతేకాదు, కంపెనీకి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులు పలు ఇతరత్రా మార్గాల ద్వారా కూడా నిధులను మళ్లించారు. ఇలా మళ్లించిన నిధుల విలువ కనీసం రూ.3 వేల కోట్లు ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఈ వ్యవహారంలో అవంత హోల్డింగ్స్ లిమిటెడ్ (ఏహెచ్ఎల్) అనే మరో కంపెనీ లబ్ధిపొందడం గమనార్హం.

ఏమేం లావాదేవీలు జరిగాయంటే...

ఏమేం లావాదేవీలు జరిగాయంటే...

2016, 2017 సంవత్సరాల్లో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కంపెనీలో జరిగిన లావాదేవీల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. 2016లో సీజీ పవర్ సంబంధించిన నాసిక్‌లోని ఆస్తులు (భూమి, ఫ్యాక్టరీ) బ్లూ గార్డెన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి రూ.200 కోట్లకు విక్రయించారు. ఈ మొత్తంలో రూ.145 కోట్లను అవంత హోల్డింగ్స్‌కు, మరో రూ.53 కోట్లను యాక్టాన్ అనే కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేశారు.

అయితే ఈ రెండు కంపెనీలు డొల్ల కంపెనీలే. ఎటువంటి వ్యాపారాలూ చేయవు. 2016 మార్చి నెలలో ఈ రెండు కంపెనీలను ఒకే చిరునామాతో ప్రారంభించినట్లు తేలింది. పైగా ఈ రెండు కంపెనీల మూలధనం కూడా రూ.లక్ష మాత్రమే.

ఇక బోర్డు అనుమతులు లేకుండానే 2017లో సీజీ పవర్‌కు చెందిన ముంబైలోని కంజూర్ మార్గ్‌లో ఉన్న భూమిని కూడా బ్లూ గార్డెన్ ఎస్టేట్స్‌కే రూ.190 కోట్లకు విక్రయించారు. అయితే ఈ భూమిని అంతకుమునుపే రూ.499 కోట్లకు విక్రయించేందుకు సీజీ పవర్ మరో కంపెనీతో ఒప్పదం చేసుకుంది. కానీ ఆ తరువాత ఏం జరిగిందో ఏమోగానీ ఆ కంపెనీని కాదని, మళ్లీ బ్లూ గార్డెన్ ఎస్టేట్స్‌కే అమ్మేసింది.

ఈ లావాదేవీ ద్వారా వచ్చిన నిధులను కూడా మల్లీ యాక్టాన్ కంపెనీకే మళ్లించారు. అంతేకాదు, ఈ లావాదేవీకి సంబంధించి ఇద్దరు సీజీ పవర్ ఉద్యోగులకు ఒకరికి రూ.3 కోట్లు, మరో ఉద్యోగికి రూ.కోటి చెల్లించారు. ఈ లావాదేవీలన్నిటికీ బోర్డు అనుమతులు కాని, రిస్క్ అండ్ ఆడిట్ కమిటీ అనుమతులు కానీ లేవు. ఇలా కంపెనీ నిధులను బయటి మార్గాల ద్వారా కూడా మళ్లించారు సీజీ పవర్‌లోని ఉన్నతస్థాయి వ్యక్తులు.

కుంభకోణం ఎలా బయటికొచ్చిందంటే...

కుంభకోణం ఎలా బయటికొచ్చిందంటే...

యస్ బ్యాంక్‌లో రూ.500 కోట్ల రుణం తీసుకున్న అవంత హోల్డింగ్స్ సంస్థ రీ-పేమెంట్‌ కోసం చైల్డ్ కంపెనీ అయిన సీజీ పవర్‌ సంస్థకు సంబంధించిన పోస్ట్ డేటెడ్ చెక్కులను ఇచ్చింది. ఈ చెక్కుల్లో ఒకటి ఏప్రిల్ 2న బౌన్స్ అయింది.

అంతకు ఒక నెల ముందు నుంచే.. అంటే మార్చి నుంచే సీజీ పవర్ మాతృసంస్థ అయిన అవంత హోల్డింగ్స్.. రుణదాతల వద్ద తాకట్టు పెట్టిన షేర్లను జప్తు చేసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో చెక్కు బౌన్స్ అవడంతో.. ఈ విషయం కాస్తా కంపెనీ ఆపరేషన్స్ కమిటీ దృష్టికి వచ్చింది. అంతేకాదు, ఈ చెక్కు సీజీ పవర్ బోర్డు అనుమతి లేకుండానే జారీ అయిన విషయాన్ని కూడా కమిటీ గుర్తించింది.

అదే సమయంలో బౌన్స్ అయిన చెక్కు స్థానంలో మరో చెక్కు జారీ చేయాలంటూ యస్ బ్యాంకు కోరగా.. అందుకు సీజీ పవర్ బోర్డు నిరాకరించింది. దీంతో యస్ బ్యాంక్ న్యాయపోరాటానికి దిగి.. సదరు చెక్కుపై సంతకం చేసిన కంపెనీ డైరెక్టర్లు, మాజీ సీఎఫ్‌వో వీఆర్ వెంకటేష్, బి.హరిహరన్‌లకు నోటీసు జారీ చేసింది.

బోర్డు అనుమతులు లేకుండానే...

బోర్డు అనుమతులు లేకుండానే...

మరోవైపు ఆపరేషన్స్ కమిటీ ఈ తప్పుడు లావాదేవీలపై మరింత లోతుగా తవ్వడం మొదలుపెట్టింది. దీంతో సీజీ పవర్ బోర్డు అనుమతి లేకుండానే ఇలాంటి ఐదు లావాదేవీలు జరిగినట్లు కమిటీ గుర్తించింది. అంతేకాదు, కంపెనీ నిధులను మళ్లించేందుకు సీజీ పవర్ సంస్థకు విదేశాల్లో ఉన్న అనుబంధ విభాగాలను కూడా వాడుకున్నారనే అనుమానాలు కూడా కలిగాయి.

ఇక గౌతమ్ థాపర్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోన్న అవంత ఇటర్నేషనల్ అనే సంస్థకు సీజీ పవర్ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో వడ్డీ లేని రుణం మంజూరైందనే విషయం తెలిసింది. ఈ లావాదేవీకి కూడా ఎలాంటి బోర్డు అనుమతులు లేకపోవడం గమనార్హం.

 నిబంధనలకు విరుద్ధంగా...

నిబంధనలకు విరుద్ధంగా...

అలాగే సీజీ మిడిల్ ఈస్ట్ అనే సంస్థ 40 మిలియన్ డాలర్ల టర్మ్ లోన్ తీసుకుని ఆ నిధులను మళ్లీ అవంత గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ‘సోలార్సీస్‌'కు మళ్లించిందని తెలిసింది. ఇలా.. ఎన్నో తప్పుడు లావాదేవీలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఛైర్మన్ గౌతమ్ థపర్, సీఎఫ్‌వోలు రాజీనామా చేయాల్సిందిగా బోర్డు కోరింది. ఇక కంపెనీ సీఈవోనైతే లాంగ్ లీవుపై పంపించింది.

అయితే ఈ కుంభకోణంపై సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్‌గానీ, దాని ప్రమోటర్ గౌతమ్ థాపర్‌గాని నోరు మెదపడం లేదు. మరోవైపు యస్ బ్యాంకు కూడా ఈ పరిణామాలపై మాట్లాడేందుకు నిరాకరించింది. ఇంకా మిగిలిన నాలుగు లావాదేవీలపై కూడా దర్యాప్తు జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

English summary

సీజీ పవర్ వ్యవహారం: రూ.3 వేల కోట్ల కుంభకోణం.. ఒక్క చెక్కు బౌన్స్‌తో వెలుగులోకి... | CG Power irregular deals may have led to Rs 3000 Crore

A report by a law firm has revealed financial irregularities at CG Power and Industrial Solutions that may have led the company to lose as much as Rs 3,000 Crore.
Story first published: Wednesday, September 18, 2019, 13:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X