MSME రుణాలపై వడ్డీ మాఫీ పథకం గడువు పొడిగింపు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు(MSME) సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలపై రెండు శాతం వడ్డీ మాఫీ పథకం గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకం అందించే ఉద్దేశ్యంతో 2018-19, 2019-20 రెండు ఆర్థిక సంవత్సరాలకు అమలు చేసేలా ఈ పథకాన్ని 2018 నవంబర్ నెలలో ప్రభుత్వం ప్రకటించింది.
మొదట వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తించేది. ఆ తర్వాత 2020 మార్చి 3వ తేదీ నుండి సహకార బ్యాంకులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేశారు. వడ్డీ మాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం మరిన్ని మార్పులు చేసింది. 2021 మార్చి 31వ తేదీ వరకు ఈ పథకం గడువును ప్రభుత్వం పొడిగించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.

ఈ పథకం కవరేజీ అన్ని టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్‌కు వర్తిస్తుంది. రూ.1 కోటి వరకు లోన్ల పైన ఈ ప్రయోజనం ఉంటుంది. ఈ పథకానికి అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలకు సంవత్సరానికి రెండు శాతం వడ్డీ ఉపశమనం కలుగుతుంది. ఈ పథకం చెల్లుబాటును వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పొడిగించినట్లు తెలిపింది.