కిరణా, స్థానిక ఎంఎస్ఎంఈలపై ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ కీలక ప్రకటన
భారత డిజిటల్ వ్యాపార విపణిలో విశేష గుర్తింపు పొందిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ఈరోజు (సెప్టెంబర్ 2) కీలక ప్రకటన చేసింది. స్థానిక ఉత్పత్తిదారులను రిటైలర్లకు అనుసంధానం చేయడంతో పాటు, టెక్నాలజీ ఆధారంగా హోల్‌సేల్ మార్కెట్ నిర్వహణను మరింత సులభతరం చేయడమే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రిటైల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్ కేంద్రం ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్. సరైన ధరలో విస్తృతశ్రేణిలో ఉత్పత్తులు లభించడం, టెక్నాలజీ ఆధారంగా తమ వ్యాపారాల‌్ని మరింతగా విస్తరించుకునే సామర్థ్యాన్ని భారతీయ వ్యాపారవేత్తలకు ఇది అందిస్తుంది.
ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫాం ఫ్యాషన్ రిటైలర్స్, ముఖ్యంగా ఫుట్‌వేర్, అప్పారెల్స్ అందుబాటులో ఉన్నాయి. గురుగ్రామ్, ఢిల్లీ, బెంగళూరులలో అందుబాటులో ఉండగా, ముంబైలో అందుబాటులోకి తేనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఫ్లిప్‌కార్ట్ దేశంలోని 20 నగరాలకు, హోం అండ్ కిచెన్, గ్రోసరీని విస్తరించాలని భావిస్తోంది. ఈ బీ2బీ ప్లాట్‌ఫాంకు యాప్‌ను రిటైలర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రానున్న రెండు నెలల కాలంలో 300 వ్యూహాత్మక భాగస్వామ్యులు, 2 లక్షల లిస్టింగ్స్ పొందడం లక్ష్యంగా కృషి చేస్తోంది. దీంతో పాటుగా ఈ ప్లాట్‌ఫాం ద్వారా 50 బ్రాండ్స్‌ను, 250 మంది స్థానిక ఉత్పత్తిదారులను రాబోయే కాలంలో అందుబాటులోకి తీసుకురానుంది.

టెక్నాలజీ ఆధారంగా వ్యాపారాన్ని మరింత సులభతరం, సమర్థవంతంగా నిర్వహించడం, తద్వారా దేశంలోని కిరాణాదారులు, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక స్థిరత్వం కల్పించడం ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్రధాన ఉద్దేశ్యమని సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆదర్శ్ మీనన్ అన్నారు. సంస్థ బీ2బీ బలమైన నెట్ వర్క్ వల్ల కిరాణాదారులు, ఎంఎస్ఎంఈల యొక్క లక్ష్యాలు సొంతం చేసుకునే వీలు కల్పిస్తుందన్నారు. సరైన ధర, టెక్నాలజీతో మెరుగైన సేవలు అందించడం ద్వారా వారి సేవలు మరింత ఫలవంతంగా ఉండేలా కృషి చేస్తుందన్నారు.