నవంబర్ 1 నుండి ఈ మార్పులు: గ్యాస్ ధర పెంపు, బ్యాంకు ఛార్జీలు, వాట్సాప్ బంద్..
దాదాపు ప్రతినెల ప్రారంభంలో ఆర్థికపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. రేపటి నుండి నవంబర్ నెల ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం, నవంబర్ 1వ తేదీ నుండి పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు మన ఆర్థిక అవసరాలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి వీటిని తెలుసుకోవడం తప్పనిసరి. ఇలాంటి మార్పుల్లో కొన్ని సామాన్యులపై భారం పడితే, మరిన్ని మార్పులు మరికొంతమందికి రాబడికి అవకాశం కల్పిస్తాయి. మరో నాలుగు రోజుల్లో దీపావళి పర్వదినం ఉంది. ఈ వెలుగుల దీపావళికి ముందే పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.

సిలిండర్ ధర పెంపు
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) గ్యాస్ సిలిండర్ ధరలు నవంబర్ నెలలో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. చమురు రంగ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి 15 రోజులకు ఓసారి ధరలను సవరిస్తాయి. ఇందులో భాగంగా నవంబర్ 1న గ్యాస్ ధరను పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకులు ఇటీవల భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పెరుగుదల కారణంగా ఇక్కడ కూడా పెరగనున్నాయి. అయితే ఇందుకు ప్రభుత్వం అనుమతి అవసరం. పెరిగితే మాత్రం రూ.1000కి పైన చెల్లించవలసి ఉంటుంది.

పెన్షనర్లకు ఊరట
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కీలక నిర్ణయం తీసుకున్నది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకకు పెన్షన్‌దారులు బ్యాంకును సందర్శించే అవసరం లేకుండా వీడియో కాల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది. నవంబర్ 1వ తేదీ నుండి ఈ సేవలను ఎస్బీఐ ప్రారంభిస్తోంది. ఇది సీనియర్ సిటిజన్స్‌కు పెద్ద ఊరట.

ఇన్వెస్టర్లకు ఊరట
ఇన్వెస్టర్లకు శుభవార్త. నవంబర్ 1న పాలసీబజార్ పబ్లిక్ ఆఫర్‌కు రానుంది. పేటీఎం ఐపీవో నవంబర్ 8న ఉంది. వీటితో పాటు ఎస్‌జేఎస్ ఎంటర్‌ప్రైజెస్, కెమికల్ మేకర్ సిగాచీ ఇండస్ట్రీస్ కూడా నవంబర్ 1న వస్తున్నాయి.

ప్రత్యేక రైళ్లు
దీపావళి పండుగ సమయంలో ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. దీపావళితో పాటు చాత్ పర్వదినం కూడా ఉంది. ఈ రైళ్లలో కొన్ని నవంబర్ 1 నుండి ప్రారంభం కాగా, మరిన్ని ఇదే నెలలో వివిధ తేదీల్లో ప్రారంభం కానున్నాయి. నవంబర్ 1 నుండి తమ నాన్-మాన్సూన్ టైమ్ టేబుల్ అమల్లోకి వస్తుందని అక్టోబర్ 25న సదర్న్ రైల్వే ప్రకటించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఛార్జీ
నవంబర్ 1వ తేదీ నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఛార్జీ వసూలుకు సిద్ధమైంది. నెలలో మూడు కంటే ఎక్కువసార్లు సొమ్మును డిపాజిట్ చేస్తే రూ.40 చార్జీ చెల్లించాలి. నెలలో మూడు కంటే ఎక్కువసార్లు నగదును ఉపసంహరణ చేసుకుంటే రూ.100 చెల్లించాలి. అయితే ఉపసంహరణకు సంబంధించి ఏటీఎం మినహాయింపు ఉంది. జన్ ధన్ అకౌంట్లకు కూడా వర్తించదు. బ్యాంక్ ఆఫ్ బరోడా బాటలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా, PNB, యాక్సిస్, సెంట్రల్ బ్యాంకులు ఛార్జీల వసూలుకు సన్నద్ధమవుతున్నాయి.

వాట్సాప్ అందులో బంద్
పాత ఫోన్స్‌ను ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ తన సేవల్ని నిలిపి వేస్తోంది. నవంబర్ 1వ తేదీ నుండి కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఆండ్రాయిడ్ 4.0.3, IOS 9, కాయ్ 2.5.1 వర్షన్ OSలతో పాటు వాటికి ముందు OSలతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. ఇందుకు సంబంధించి ఫోన్ మోడల్స్‌లో జాబితాను వాట్సాప్ ఇప్పటికే విడుదల చేసింది.