Mother's Day: తల్లికి పూవులే కాదు, ఈ గిఫ్ట్‌లు ఇవ్వండి!
నేడు (మే 8) మాతృదినోత్సవం. చాలామంది తమ తల్లుల పైన ప్రేమను చూపిస్తూ వాట్సాప్ స్టేటస్‌లు పెడతారు... సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు... మరికొంతమంది నేరుగా తల్లికి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు పూవులు, ఇతర బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో బహుమతి తీరు మారిపోయింది. కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల వరకు బహుమతులు ఇవ్వాలనుకుంటే పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం మంచింది.
తాత్కాలిక ప్రయోజనం కంటే భవిష్యత్తు గురించి ఆలోచించి ఇవ్వాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తుంటారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకు మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేయాలి.

సిప్
సిప్స్ నుండి షేర్ల వరకు, బంగారం నుండి ఇన్సురెన్స్ వరకు వివిధ రకాల భావి ప్రయోజనాలతో కూడిన బహుమతిని ఇచ్చే ప్రయత్నం చేయాలి. తల్లికి ఆర్థిక స్వాతంత్రం ఉండేలా ఈ బహుమతి ఉండేలా చూసుకోవచ్చు. తల్లి కోసం ఈ మాతృదినోత్సవం రోజున సిప్ (SIP) ప్లాన్ చేయండి. ప్రతి నెల కొంతమొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తం చేతికి వస్తుంది.
అప్పుడు మీ తల్లి దానిని ప్రత్యేకంగా ఖర్చు చేయడానికి ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించవచ్చు. ఏదైనా ట్రిప్ కోసం లేదా ఏదైనా వస్తువు కొనుగోలు కోసం దానిని ఉపయోగించుకునే అవకాశమివ్వవచ్చు. మీ తల్లి కల తెలుసుకొని, దానిని త్వరలో నెరవేర్చుకునేలా సిప్ ప్రారంభించవచ్చు.

ఆరోగ్యం ముఖ్యమే
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే అనుకోని ప్రమాదాలు, సంఘటనలు కొన్ని చేదు అనుభవాలను కలిగిస్తాయి. తల్లి ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సురెన్స్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అన్నీ కవర్ అయ్యే బీమా తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఉంటే క్రిటికల్ ఇల్ నెస్ కవర్ ముఖ్యం. ఫుల్ బాడీ చెక్-అప్ ప్యాకేజీ వంటివి కూడా ఇవ్వవచ్చు.

బంగారం కొనుగోలు
భారతీయ మహిళలకు బంగారం అంటే మక్కువ. కాబట్టి ఇటు అమ్మ కోరిక తీర్చినట్లు ఉంటుంది. మరోవైపు పెట్టుబడి పెట్టినట్లుగా ఉంటుంది. అందుకు బంగారం మంచి సాధనం. గోల్డ్ బాండ్స్ వంటివి కొనడం ద్వారా వడ్డీని కూడా పొందవచ్చు. సొంత వ్యాపారంపై ఆసక్తి ఉంటే నిధి ఇవ్వడం, స్టాక్స్ కొనివ్వడం వంటివి కూడా చేయవచ్చు.