HDFC గుడ్‌న్యూస్, హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: SBI, కొటక్ బ్యాంకులోను...
ప్రయివేటురంగ దిగ్గజం HDFC తమ కస్టమర్లకు, ఇళ్లు కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. తమ బ్యాంకు ఖాతాదారులకు హోం లోన్ పైన వడ్డీ రేట్లను 0.05 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల క్రెడిట్ హిస్టరీ, తీసుకునే రుణ మొత్తంతో సంబంధం లేకుండా కొత్త రుణాలకు 6.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు మందగమనం, ఈ ఆర్థిక సంవత్సరం కరోనా కారణంగా ఆర్బీఐ, తదనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తూ కస్టమర్లకు ఊరటను కల్పిస్తోన్న విషయం తెలిసిందే.

వరుసగా వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా వడ్డీ రుణ రేట్లను తగ్గించాయి. వరుసగా 6.7%, 6.65 శాతానికి రుణాలు అందిస్తున్నాయి. హోం లోన్ పైన రిటైల్ ప్రైమ్ రుణ రేటు (RPLR)ను కూడా 0.05 శాతం మేర తగ్గిస్తున్నట్లు, దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న కస్టమర్లకు కూడా వడ్డీ రేటు ఈ మేరకు తగ్గుతుందని HDFC తెలిపింది. HDFC తగ్గించిన 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు మార్చి 4వ తేదీ నుండి అమలవుతుందని HDFC రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఎస్బీఐ వివిధ రకాల హోంలోన్స్
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70 శాతం నుండి హోం లోన్స్ ఆఫర్ చేస్తోంది. కస్టమర్లకు వివిధ రకాల హోమ్ లోన్స్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. రెగ్యులర్ ఎస్బీఐ హోం లోన్ ప్లాన్స్, ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్, ఆర్మీ, డిఫెన్స్‌కు ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు ఎస్బీఐ మ్యాగ్స్ గెయిన్ హోమ్ లోన్, ఎస్బీఐ స్మార్ట్ హోమ్ లోన్, ఎస్బీఐ స్మార్ట్ హోమ్ పేర్లతో అందిస్తోంది. వీటితో పాటు ఎస్బీఐ ఎన్నారై హోమ్ లోన్, అధిక మొత్తంలో తీసుకునే వారికి ఎస్బీఐ ఫ్లెక్సీ పే హోమ్ లోన్, మహిళలకు ఎస్బీఐ హర్ ఘర్ హోమ్ లోన్ అందిస్తోంది. ఎస్బీఐ మార్చి 31, 2021 వరకు హోం లోన్ పైన ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది.

కొటక్ మహీంద్రా బ్యాంకు హోం లోన్
కొటక్ మహీంద్రా బ్యాంకు హోంలోన్ పైన 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇది పరిమిత కాలానికి వర్తిస్తుందని తెలిపింది. కస్టమర్లు 6.65 శాతానికే మార్చి 31 వరకు హోం లోన్స్ తీసుకోవచ్చు! ప్రత్యేక వడ్డీ తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. హోంలోన్ తీసుకునే వారికి, బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ చేసుకునే వారికి ఇద్దరికీ ఇది వర్తిస్తుంది.