అమెరికా ఆర్థిక వ్యవస్థ అదుర్స్: సెప్టెంబర్ క్వార్టర్‌లో 33.1% జంప్
వాషింగ్టన్: కరోనా మహమ్మారి నేపథ్యంలో పతనమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోంది. 2020 రెండో త్రైమాసికంలో దారుణంగా పడిపోయన అమెరికా జీడీపీ మూడో త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో పుంజుకుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 33.1 శాతం జంప్ చేసింది. అంతకుముందు త్రైమాసికంలో వృద్ధి రేటు 31.4 శాతం ప్రతికూలత నమోదు చేసింది. దీంతో మొదట్లో వేసిన వృద్ధి అంచనాలను ఆర్థిక వ్యవస్థ ఎలాంటిమార్పులు లేకుండా సాధించినట్లుగా అయింది.
భారత్ పదేపదే ఇదే మాట: 43 యాప్స్ నిషేధంపై చైనా అక్కసు

రికార్డ్ వృద్ధి
సెప్టెంబర్ త్రైమాసికంలో అమెరికా జీడీపీ 33.1 శాతం వృద్ధిని సాధించడం దేశ చరిత్రలోనే అత్యధికమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 1947నుండి గణాంకాలు నమోదు చేయడం ప్రారంభించాక 1950లో మాత్రమే దేశ జీడీపీ ఒక త్రైమాసికంలో 16.7 శాతం నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా 33.1 శాతం నమోదు చేసింది. వ్యాపార రంగంలో పెట్టుబడులు, హౌసింగ్, ఎగుమతులు భారీగా పుంజుకున్నప్పటికీ స్థానిక ప్రభుత్వాల వినిమయంతో పాటు వినియోగ వ్యయాలు తగ్గడం, నిల్వలు పెరగడం వంటివి బలహీనపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

రికవరీ సంకేతాలు
మూడో త్రైమాసికంలో జీడీపీ పెరుగుదల వ్యాపారాలు తిరిగి తెరుచుకొని, ఆర్థిక రికవరీని సూచిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కరోనా కారణంగా వాయిదాపడిన లేదా పరిమితం చేయబడిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన సంకేతాలు కనిపిస్తున్నాయని అమెరికా వాణిజ్య విభాగం తెలిపింది. వ్యయ వినియోగాలు, ప్రయివేటు జాబితా పెట్టుబడులు, ఎగుమతులు, నాన్-రెసిడెన్షియల్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్, రెసిడెన్షియల్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్, పెరగగా, ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించుకున్నాయి.

తదుపరి క్వార్టర్ అంచనాలు..
వినియోగదారుల వ్యయం సూచీ 1.6 శాతం నుండి 3.7 శాతానికి పెరిగింది. నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాలను 4.5 శాతం నుండి 3.5 శాతానికి తగ్గించాయి. 2021 మొదటి త్రైమాసికంలో 3.5 శాతం నుండి 1 శాతానికి తగ్గించింది. కాగా, కొంతమంది విశ్లేషకులు మహామాంద్యం పొంచి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.