అమెరికాలో స్థిరపడాలనేది లక్షలాది మంది భారతీయుల కల. కానీ, ఆ కల నెరవేరడం ఇప్పుడు దాదాపు అసాధ్యంగా మారుతోంది. అమెరికా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ (Green Card) లేదా పర్మినెంట్ వీసా కోసం భారతీయులు ఏకంగా 134 ఏళ్లు వేచి చూడాల్సి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ లేదా సోమాలియా వంటి దేశాల నుంచి వచ్చే వారికి కేవలం రెండేళ్లలోనే గ్రీన్ కార్డ్ లభిస్తుండటం చాలా వింతగా అనిపించడమే కాకుండా పెద్ద చర్చకు దారితీస్తోంది.

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ఏ ఒక్క దేశానికి కూడా ఏడాదికి ఇచ్చే మొత్తం ఎంప్లాయ్‌మెంట్ గ్రీన్ కార్డ్స్‌లో 7 శాతం కంటే ఎక్కువ కోటా ఇవ్వకూడదు. దీనినే 'పర్-కంట్రీ క్యాప్' (Per-country cap) అంటారు. భారత్ నుంచి ఏటా వేలాది మంది నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులు, ఇంజనీర్లు అమెరికా వెళ్తుంటారు. కానీ, ఐస్ ల్యాండ్ లాంటి చిన్న దేశానికి ఎంత కోటా ఉందో, భారత్ కు కూడా అంతే కోటా ఉండటంతో దరఖాస్తులన్నీ పెండింగ్ లో పడిపోతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 11 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్నారు.
హెచ్-1బి వీసా ఉచ్చు
చాలా మంది భారతీయులు ఇష్టపూర్వకంగా హెచ్-1బి వీసాపై ఉండటం లేదని, వ్యవస్థలోని లోపాల వల్లే వారు అందులో చిక్కుకుపోతున్నారని ఇమ్మిగ్రేషన్ నిపుణుడు సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇతర దేశాల వారు సులభంగా గ్రీన్ కార్డ్ పొందుతుంటే.. నైపుణ్యం ఉన్న భారతీయులు మాత్రం దశాబ్దాల తరబడి తాత్కాలిక వీసాలపైనే గడపాల్సి వస్తోంది. EB-2, EB-3 వంటి విభాగాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఎదురుచూపులు మరింత ఎక్కువగా ఉన్నాయి.
4 లక్షల మంది గ్రీన్ కార్డ్ రాకుండానే..?
కేటో ఇన్‌స్టిట్యూట్ (Cato Institute) నివేదిక ప్రకారం.. ఒక భయంకరమైన నిజం బయటపడింది. ప్రస్తుతం ఉన్న వెయిటింగ్ లిస్ట్ ప్రకారం చూస్తే, సుమారు 4.24 లక్షల మంది భారతీయులు తమకు గ్రీన్ కార్డు (Green Card) రాకముందే మరణించే అవకాశం ఉంది. అంటే వారి దరఖాస్తు ప్రాసెస్ అయ్యే సమయానికి వారు బతికి ఉండకపోవచ్చు. 2023 లో నమోదైన మొత్తం 18 లక్షల పెండింగ్ దరఖాస్తుల్లో 68 శాతం భారతీయులవే కావడం గమనార్హం.
పరిష్కారం లేదా?
భారత సంతతికి చెందిన అమెరికన్ ప్రతినిధులు రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్ వంటి వారు ఈ 7 శాతం నిబంధనను తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. చట్టసభల్లో అవి ఇంకా ఆమోదం పొందలేదు. ఈ నిబంధన మారనంత వరకు భారతీయులకు గ్రీన్ కార్డ్ నిరీక్షణ తప్పదు.
నైపుణ్యం కలిగిన భారతీయులను ప్రోత్సహించాల్సింది పోయి అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ వారిని శిక్షిస్తోందని నిపుణులు వాదిస్తున్నారు. ఒక పక్క పాకిస్థానీయులకు 2 ఏళ్లలో పని పూర్తవుతుంటే, భారతీయులకు వందేళ్ల కంటే ఎక్కువ కాలం పట్టడం విచారకరం. ఈ పరిస్థితులు మారాలంటే అమెరికా తన ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సమూల మార్పులు చేయాల్సిందే అని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications