Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..
తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. 2026-27 వార్షిక బడ్జెట్ లో భాగంగా సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో 'భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future city)' ని నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు అదనంగా ఇది నాలుగో నగరంగా (Fourth City) అవతరించబోతోంది. దీని ప్లానింగ్ ఎలా ఉండబోతుందంటే..
హైదరాబాద్ శివార్లలో ముచ్చర్ల ప్రాంతం కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఈ నగరం రాబోయే తరాల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మితం కానుంది. భారత్ ఫ్యూచర్ సిటీ కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా అంతర్జాతీయ విద్యా, సాంకేతిక కేంద్రంగా మారనుంది. ఈ నగరంలో ఇప్పటికే 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' ని ఏర్పాటు చేశారు. దీనికి తోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ ను కూడా ఇక్కడే స్థాపించబోతున్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను (GCC) ఇక్కడ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దీనివల్ల లక్షలాది మంది యువతకు ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

పర్యావరణ హితం - నెట్ జీరో సిటీ
భవిష్యత్ తరాల కోసం నిర్మిస్తున్న ఈ నగరం పూర్తిగా పర్యావరణ హితంగా (Eco-friendly) ఉండబోతోంది. 'నెట్ జీరో' (Net Zero) లక్ష్యంతో, కాలుష్య రహిత రవాణా వ్యవస్థను ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. 30,000 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం, సౌర శక్తి వినియోగం , శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతర్జాతీయ నగరాలైన సింగపూర్, దుబాయ్ తరహాలో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండబోతున్నాయి.
మెట్రో కనెక్టివిటీ , స్పోర్ట్స్ విలేజ్
భారత్ ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్ లో స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా ఈ నగరానికి చేరుకునేలా మెట్రో లైన్ విస్తరణ జరగనుంది. అంతేకాకుండా, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ఇక్కడ ఒక భారీ 'స్పోర్ట్స్ విలేజ్' (Sports Village), క్రికెట్ స్టేడియంను కూడా నిర్మించనున్నారు. ఇది కేవలం వ్యాపార కేంద్రంగానే కాకుండా, క్రీడలు, వినోదానికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఉత్సాహం
30,000 ఎకరాల భారీ విస్తీర్ణంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ వల్ల దక్షిణ హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది. ముచ్చర్ల, కందుకూరు, పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ప్రణాళికాబద్ధమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , నిరంతర విద్యుత్ సరఫరాతో ఈ నగరం గృహ కొనుగోలుదారులకు మొదటి ప్రాధాన్యతగా మారనుంది.
ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం ఆశించిన 'విజన్-2047'లో భారత్ ఫ్యూచర్ సిటీ ఒక వెన్నెముక వంటిది. 30,000 ఎకరాల్లో విస్తరించిన ఈ ఫ్యూచర్ సిటీ (Future city) ప్రాజెక్ట్ విజయవంతమైతే హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఖాయం.


Click it and Unblock the Notifications