కరోనా దెబ్బతో ఐటీ కంపెనీల సరికొత్త ప్రయోగం, రియల్ ఎస్టేట్‌కు దెబ్బ?
దేశీయ ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), విప్రో వంటి సంస్థలు కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. లాక్ డౌన్ అనంతరం కూడా దీనికే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా కార్యాలయాల కోసం పెట్టే ఖర్చులు తగ్గించుకోనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోడక్టివిటీ బాగుందని, తర్వాత కూడా ఎక్కువ మంది ఉద్యోగులకు ఈ ఆప్షన్ ఇచ్చే అవకాశాలపై ఆలోచిస్తున్నట్లు వివిధ కంపెనీలు వెల్లడిస్తున్నాయి.

కంపెనీల నిర్ణయం... రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాధాన్యత ఇస్తే అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశమున్న కంపెనీలు చాలా వరకు ఆ దిశగా ఆలోచిస్తే, కార్యాలయాల స్పేస్‌కు డిమాండ్ పడిపోతుందని, అది రియల్ ఎస్టేట్ పైన ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ప్రోడక్టివిటీ పెరిగింది
వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రోడక్టివిటీ పెరిగిందని కంపెనీలు చెబుతున్నాయని, భవిష్యత్తులో కూడా దీనికి కంపెనీలు మొగ్గు చూపవచ్చునని ఎక్స్‌ఫీనో కో-ఫౌండర్ కమల్ కారంత్ అన్నారు. ప్రస్తుతం 70 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారని తెలిపారు.

గణనీయ పెరుగుదల
మిడ్ టైర్ ఐటీ సేవల కంపెనీ సొనాటా సాఫ్టువేర్ ప్రకారం 70 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ముందు ముందు కూడా ఇది కొనసాగవచ్చు. ఎందుకంటే ఉద్యోగులు అందరూ ఇంటి నుండి పని చేసిన ప్రస్తుత సమయంలో ఉత్పాదకతలో గణనీయంగా పెరుగుదల నమోదయిందని ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకర్ రెడ్డి అన్నారు.

ట్యాక్స్ బెనిఫిట్స్.. అనుమతి
వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో ప్రోడక్టివిటీ 70 శాతం వరకు పెరిగిందని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఐటీ సంస్థలకు కస్టమర్ల అనుమతి అవసరం. అదే సమయంలో సెజ్ నుండి పని చేస్తున్నప్పటి ట్యాక్స్ బెనిఫిట్స్ దీనికి కూడా ఉంటాయా స్పష్టత రావాలి.

ఇదివరకు జరగని ప్రయోగం.. కొవిడ్ దెబ్బతో..
కరోనా కారణంగా కంపెనీలు తమ తమ ఉద్యోగులు, వర్క్ ప్లేస్ విషయంలో కొంత స్పష్టత వచ్చిందని నాస్కాం చెబుతోంది. సహజంగా ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి ప్రయోగాలు పెద్దగా జరగలేదని తెలిపింది. కానీ కొవిడ్ 19 కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని తెలిపింది. ఆఫీస్ నుండి పని చేసే వారి సంఖ్య 25 శాతమా 50 శాతమా అనేది పరిస్థితిని బట్టి ఉంటుందని అంటున్నారు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్‌తో భారం తగ్గించుకోవచ్చునని కంపెనీలు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications