Small savings rate: వచ్చే నెలలో స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం
కరోనా, ఆ తర్వాత రష్యా - ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నుండి భారత్ సహా ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ద్రవ్యోల్భణం పెరగకుండా, ఆర్థిక వృద్ధిని పట్టాలు ఎక్కించేందుకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్బీఐ రెపో రేటును గత రెండు నెలల కాలంలో 90 బేసిస్ పాయింట్లు పెంచింది. వచ్చే నెలలో జరిగే ఎంపీసీ సమావేశంలోను రెపో రేటు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రుణం తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తక్కువగా ఉండగా, డిపాజిటర్లకు తక్కువ వడ్డీ వచ్చింది. గత నెల నుండి క్రమంగా రుణభారం పెరుగుతుండగా, డిపాజిటర్ వడ్డీ రేటు పెరుగుతోంది.
ఇప్పటికే వివిధ బ్యాంకులు రుణ వడ్డీ రేట్లు, డిపాజిటర్ వడ్డీ రేట్లు పెంచాయి... పెంచుతున్నాయి. రెండేళ్ల విరామం తర్వాత వచ్చే నెల నుండి స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. జీ-సెక్ ఈల్డ్స్‌లో షార్ప్ పెరుగుదల స్మాల్ సేవింగ్స్ రెట్లు పెరగడానికి దోహదపడతాయని ఆర్థిక పండితులు విశ్లేషిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ వంటి స్థిరఆదాయం కలిగిన వారికి ఇది రక్షణగా ఉంటుందని, జూలై 1వ తేదీ నుండి ఆర్థిక మంత్రిత్వ శాఖ రేట్లను పెంచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సవరిస్తుంది.

అప్పుడు పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి స్కీమ్స్‌కు వడ్డీ రేట్లు పెరగవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు 7.1 శాతం, ఎన్ఎస్‌సీ వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పైన వడ్డీ రేటు 7.6 శాతంగా ఉండగా, సీనియర్ సిటిజన్ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్ పైన 7.4 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్రపై 6.9 వడ్డీ రేటు ఉంది.