సెన్సెక్స్ 462 పాయింట్లు జంప్, రూ.661కి పతనమైన ఎల్ఐసీ షేర్
స్టాక్ మార్కెట్లు శుక్రవారం(జూన్ 24) భారీ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 52,265 పాయింట్ల వద్ద ముగియగా, నేడు రోజంతా లాభాల్లోనే కదలాడింది. కాస్త పైకి, కిందకు కదిలినప్పటికీ అది కూడా లాభాల్లోనే. ఎప్పుడు కూడా కనీసం దాదాపు 400 పాయింట్ల లాభం కంటే దిగువకు రాలేదు. ఓ సమయంలో సెన్సెక్స్ 53,000 పాయింట్లకు చేరువైంది. సెన్సెక్స్ ఉదయం 52,654 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,909 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,447 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 462 పాయింట్లు ఎగిసి 52,727 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 142 పాయింట్లు ఎగిసి 15,699 పాయింట్ల వద్ద ముగిసింది.
ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. కమోడిటీ ధరలు తగ్గడం సూచీలకు కలిసి వచ్చింది. అమెరికాలో బాండ్స్ రాబడులు తగ్గడం, చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుండి దిగి రావడం సూచీల సెంటిమెంటును బలపరిచింది. ఆసియా సూచీలు కూడా నేడు లాభాల్లో ఉన్నాయి. ఐరోపా మార్కెట్లు కూడా సానుకూలంగా కదలాడుతున్నాయి.

ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ సూచీలు ఒక శాతం చొప్పున లాభపడగా, ఐటీ స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో కార్ప్, ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, HUL ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా ఉన్నాయి. ఎల్ఐసీ స్టాక్ నేడు మరింత క్షీణించింది. నేటి సెషన్‌లో 0.58 శాతం పడిపోయి 3.85 శాతానికి తగ్గింది. ఈ స్టాక్ ప్రస్తుతం రూ.661 స్థాయికి పడిపోయింది.