గుడ్‌న్యూస్, లోన్ మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించవచ్చు!
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు, వ్యాపారులకు లోన్ మారటోరియం రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వెసులుబాటు కల్పించింది. దీంతో బ్యాంకులు మార్చి నుండి ఆగస్ట్ మాసం వరకు తమ కస్టమర్లకు మారటోరియం అవకాశం కల్పించాయి. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో చాలామంది ఈ వెసులుబాటును ఉపయోగించుకున్నారు. డిమాండ్ లేక, ఉత్పత్తి లేక కంపెనీలు నష్టపోతే, ఉద్యోగాల కోత, వేతనకోత వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో లోన్ మారటోరియం నిన్నటితో (ఆగస్ట్ 31)తో ముగిసింది. దీనిని పొడిగించాలని కొన్ని రంగాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సుప్రీం కోర్టుకు లోన్ మారటోరియంపై తన అభిప్రాయాన్ని తెలిపింది.
కరోనా.. లోన్ మారటోరియంకు సంబంధించి మరిన్ని వార్తలు

మారటోరియం రెండేళ్లపాటు పొడిగించవచ్చు
వివిధ రుణాలపై మారటోరియంను రెండేళ్ల వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు (సెప్టెంబర్ 1) సుప్రీం కోర్టుకు తెలిపింది. మారటోరియం వ్యవధిలో వడ్డీని పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ, కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ మారటోరియం కేసును విచారిస్తోంది. కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న రంగాలను గుర్తిస్తున్నామని, ఆయా రంగాలకు ప్రయోజనాలు కల్పిస్తామన్నారు.

కాస్త న్యాయంగా ఆలోచించండి..
మారటోరియం కాలంలో వడ్డీని పరిగణించే అవకాశముందని సొలిసిటర్ జనరల్ చెప్పడంపై సుప్రీం కోర్టు స్పందించింది. న్యాయంగా ఆలోచించాలని కేంద్రానికి సూచించింది. ఈ విచారణపై ఎక్కువ ఆలస్యం చేయదల్చుకోలేదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. దేశం ప్రస్తుతం కరోనా వల్ల సమస్యను ఎదుర్కొంటోందన్నారు. అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీనిపై రేపు పూర్తిస్థాయిలో వాదనలు వింటామని తెలిపింది.

అన్ని చర్యలు తీసుకున్నాం..
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. వైరస్ కట్టడి కోసం తీసుకున్న కఠిన చర్యల వల్ల దేశ వృద్ధి రేటు 24 శాతం మేరకు కుంగిపోయిందన్నారు. అయితే మారటోరియాన్ని రెండేళ్ల పాటు పొడిగించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పడం ద్వారా భారీగా నష్టపోయిన రంగాలకు ఇది కొంత ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు.

మారటోరియం కాలంలో వడ్డీ
కరోనా కారణంగా ఆదాయాలు తగ్గిన వారికి ఉపశమనం కల్పించేందుకు ఆర్బీఐ లోన్ మారటోరియం ఇచ్చింది. అయితే ఈ కాలంలో రుణాలపై వడ్డీ వసూలు చేయడం, ఆ వడ్డీపై వడ్డీని విధించడం వల్ల లాభం లేదని కొంతమంది సుప్రీం కోర్టులో పిటిషషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. మారటోరియం వల్ల రుణాలు చెల్లించే కాలపరిమితి మాత్రమే పెరుగుతుందని, వడ్డీ మాత్రం చెల్లించాల్సిందేనని ఆర్బీఐ గతంలో తెలిపింది. దీనిపై కేంద్రం వైఖరి తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.