ఆగని లేఆప్స్, 3500 మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ బ్యాకింగ్ దిగ్గజం
బ్యాంకింగ్ రంగంలో లేఆప్స్ ఆగడం లేదు. ప్రముఖ బ్యాకింగ్ కంపెనీలు దశలవారీగా తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతూనే ఉన్నాయి.దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయలతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు భయపెడుతున్న ఆర్థికమాంద్య భయం, మరోవైపు గ్లోబల్ వైడ్ గా నెలకొన్న అస్థిర పరిస్థితులు ఉద్యోగులతో పాటు కంపెనీలను కూడా ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్నాయి.ఇప్పటికే వందలాది కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి.
తాజాగా దీని సరసన సిటీ బ్యాంక్ కూడా చేరింది. సిటీ గ్రూప్ గ్లోబల్ వైడ్ తమ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఉద్యోగ కోతలు విదిస్తోంది. ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న యూఎస్ బ్యాంకు వేలాది మంది ఉద్యోగులను తీసేస్తోంది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో చైనాలో దాదాపు 3,500 టెక్నాలజీ ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు గురువారం తెలిపింది.

ఈ ఉద్యోగాల కోతలు షాంఘై, డాలియన్‌లోని చైనా సిటీ సొల్యూషన్ సెంటర్లలో ఉండనున్నాయి. ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికం ప్రారంభం నాటికి ఈ కోతలు పూర్తవుతాయని సిటీ బ్యాంక్ తెలిపింది. ఈ లేఆప్స్ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ యూనిట్‌లో జరిగాయి. ఈ యూనిట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ అభివృద్ధి, దాని నిర్వహణ సేవలను అందిస్తుంది. అయితే ఎంతమందిని తొలగిస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొంతమందిని మాత్రం సిటీలోని సాంకేతిక కేంద్రాలకు తరలిస్తామని కంపెనీ తెలిపింది.
గత ఏడాది జనవరిలో ప్రకటించిన విస్తృత ప్రణాళిక ద్వారా సిటీ బ్యాంక్ తన శ్రామిక శక్తిలో 10% లేదా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా చైనాలో ఈ లేఆప్స్ జరుగుతున్నాయి. అమెరికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పోలాండ్‌లలో కంపెనీ విస్తరణకు ప్రణాళికను రచిస్తోంది. అందులో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించింది. సిటీ బ్యాంక్ చైనా వ్యాపార అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.
అయితే ఇలా ఖర్చులను తగ్గించుకుందుకు సిటీ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకులు కూడా రెడీ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల విధానాలతో.. వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పడుతుండటంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవాలని అనేక ప్రధాన ప్రపంచ బ్యాంకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
హాంగ్ కాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ బ్యాంక్, HSBC అనుబంధ సంస్థ, గత నెలలో వ్యాపారాన్ని రీడెవలప్ చేస్తున్నట్లు తెలిపింది, దీని వలన 1% మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. 2026 చివరి నాటికి $1.8 బిలియన్ల ఖర్చులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న HSBC గ్రూప్ CEO జార్జెస్ ఎల్హెడెరీ నేతృత్వంలోని ఖర్చు తగ్గింపు డ్రైవ్‌లో భాగంగా ఈ ఉద్యోగాల కోతలు జరిగాయి . JP మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో సహా అనేక వాల్ స్ట్రీట్ బ్యాంకులు కూడా పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించే వార్షిక ప్రక్రియను ప్రారంభించాయి . బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ సంవత్సరం తన పెట్టుబడి బ్యాంకింగ్ యూనిట్‌లో 150 బ్యాంకర్ ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం .