Success Story: ఆన్‌లైన్ బేకరీ.. ముగ్గురు స్నేహితుల ఆలోచన.. కోట్లలో వ్యాపారం..
Success Story: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రాకతో బేకరీలు, కాఫీ బార్లు వంటి అనేక కొత్త దుకాణాలు ప్రతిచోటా ప్రారంభించబడ్డాయి. కానీ కొత్తగా ఆలోచించిన ముగ్గురు స్నేహితులు వ్యాపారాన్ని తమ ఆలోచనతో ప్రజలకు చేరువ చేశారు. కేవలం రెండు లక్షలతో ప్రారంభించి కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించిన వీరి గురించి ఇప్పుడు తెలుసుకోండి.

ఆన్‌లైన్ బేకరీ ఏర్పాటు..
ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు కాలేజీ స్నేహితులు హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్, సుమన్ పాత్ర కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. 2016లో బేకింగ్‌కో ఆన్‌లైన్ బేకరీగా ప్రారంభమైంది. ఇది క్లౌడ్ కిచెన్ మోడల్‌లో పని చేస్తోంది. ప్రస్తుతం ఇది 11 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ వ్యాపారం, ఆదాయం కోట్లకు చేరుకుంది.

ప్రారంభం ఇలా..
2007లో కళాశాల నుంచి పట్టా పొందిన తర్వాత ముగ్గురు స్నేహితులు కొన్ని సంవత్సరాలు కార్పొరేట్ ఉద్యోగాలలో పనిచేశారు. ఆ తర్వాత 2010లో ప్రారంభించిన ఫ్లవర్ ఆరా, కేక్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు. కేవలం 2 లక్షల మూలధనంతో ఈ స్నేహితులు మొదట్లో ఒకరిద్దరు ఉద్యోగులను నియమించుకున్నారు.

వాలెంటైన్స్ డే తో మారిన తలరాత..
వాలెంటైన్స్ డే- 2010 వారి జీవితంలో ఒకపెద్ద మలుపు. ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. ఆ సమయంలో స్వయంగా వారే డెలివరీ చేసే పనిలో పడ్డారు. విస్తరణకు అదే సరైన సమయమని వారు భావించారు. ఆ తర్వాత 2016లో ప్యాకింగ్‌కో అనే కొత్త ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించారు. అన్ని ప్రదేశాలకు రుచికరమైన, ఒకే రుచి ఉండేలా జాగ్రత్తలు పాటించటంపై శ్రద్ధ పెట్టారు. అలా క్రమంగా దేశంలోని అనేక నగారాలకు విస్తరించినట్లు ఈ యువ వ్యాపారవేత్తలు వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలో..
రుచికరమైన ఆహారం ఎల్లప్పుడూ స్వాగతించబడుతుందని, అలా తమ వ్యాపారానికి భారీ స్పందన లభించిందని వారు చెప్పారు. ఈ క్రమంలో సేవలను హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ NCR వంటి ఇతర టైర్ టూ నగరాల్లో విస్తరించడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్యాకింగ్‌కో విక్రయాల్లో 30% కంపెనీ వెబ్‌సైట్ ద్వారా, మిగిలిన 70% స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిపారు.

75 కోట్ల వ్యాపారం..
2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్యాకింగ్‌కో రూ.75 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ప్రస్తుతం సంస్థ కింద 500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇది ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా ప్రారంభించాయి. ఈ ఏడాది ప్రారంభంలో వారు తమ మెుదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ని ఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యువ వ్యాపారులు క్రమంగా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.