డీజిల్ రేటు కూడా రూ.100 దాటేసింది: రూ.107ను టచ్ చేసిన పెట్రోల్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు. తమ దూకుడును కొనసాగిస్తూనే పోతోన్నాయి. ఇంధన ధరల తగ్గింపు విషయాన్ని దాదాపు మర్చిపోయినట్టే కనిపిస్తోన్నాయి. కిందటి నెల 4వ తేదీన ఏ ముహూర్తంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు పూనుకున్నాయో గానీ.. దానికి ఎక్కడా బ్రేకులనేవే పడట్లేదు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్‌ను దాటేసింది. ఇక డీజిల్ వంతు వచ్చింది. డీజిల్ రేటు కూడా లీటర్ ఒక్కింటికి 100 రూపాయల మార్క్‌ను దాటేసింది. పెట్రోల్ రేటు 107కు చేరింది.

పెట్రోల్‌పై 27, డీజిల్‌పై 23
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 27 పైసలు, డీజిల్ 23 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.96.12, డీజిల్ 86.98 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రేటు 102 మార్క్‌ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.102.30 పైసలు పలుకుతోంది. డీజిల్ ధర 94.39కి చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 97.43, డీజిల్ ధర రూ. 91.64, కోల్‌కతలో పెట్రోల్ రూ.96.06 పైసలు, డీజిల్ ధర రూ.89.83 పైసలు పలుకుతోంది. భోపాల్‌లో పెట్రోల్-104.29, డీజిల్-95.60 రూపాయలకు చేరింది.

శ్రీగంగానగర్‌లో రికార్డ్..
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర రికార్డు నెలకొల్పింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 107 రూపాయలకు చేరింది. మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్‌లో రూ.106.87, మహారాష్ట్రలోని పర్భణీలో 104.64, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 102.73 పైసలుగా నమోదైంది. శ్రీగంగానగర్‌లో డీజిల్ ఏకంగా 100.05 పైసలకు చేరింది. డీజిల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటడం చరిత్రలో ఇదే తొలిసారి. చమురు సంస్థలు ఇప్పుడు ప్రదర్శిస్తోన్న దూకుడు ఇదే తరహాలో కొనసాగిస్తే.. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ డీజిల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటడానికి ఎన్నో రోజుల పట్టకపోవచ్చు.

అనేక నగరాల్లో ఇదే పరిస్థితి..
అనూప్‌పూర్‌లో డీజిల్ రేటు రూ.97.98 పైసలు ఉంటోంది. శ్రీగంగానగర్, అనూప్‌పూర్, నగరాబంధ్, పర్భణీల్లో పెట్రోల్ రేటు తొలిసారిగా వంద రూపాయలు దాటేశాయి. ఇప్పుడా బాధ్యతను డీజిల్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. నిరాటంకంగా పెరుగుతూ వస్తోన్న ధరలతో అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. ఏపీ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ముంబైలో 102 రూపాయలకు పైగా దీని ధర చేరగా.. రత్నగిరి, పర్భణీ, ఔరంగాబాద్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, శ్రీగంగానగర్, బన్స్‌వారా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్, ఏపీలోని గుంటూరు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కర్ణాటకలోని చిక్‌మగళూరు, శివమొగ్గ, దావణగెరె వంటి చోట్ల వంద రూపాయలను దాటేసింది.