Budget 2022: 50% హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనం..
ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉద్యోగి వేతనంలో హెచ్ఆర్ఏ కలిసి ఉంటుంది. శాలరీ స్ట్రక్చర్‌లో ఇది కీలకం. ఉద్యోగులకు దీని గురించి తెలిసి ఉంటుంది. అద్దె ఇంట్లో ఉండే ఉద్యోగులు పన్ను భారం తగ్గించుకునేందుకు హెచ్ఆర్ఏను క్లెయిమ్ చేసుకోవచ్చు. హౌస్ రెంట్ అలవెన్స్ మొత్తం పైన పన్ను ఉండదు. బేసిక్ శాలరీ మాదిరి కాకుండా దీనిపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందవచ్చు. బేసిక్ శాలరీ పూర్తిగా పన్ను పరిధిలోకి వచ్చేది. ఈ హెచ్ఆర్ఏలో మూడు రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మెట్రో నగరాలకు చెందినది. దీని పరిధిని ఈ బడ్జెట్‌లో విస్తరించే అవకాశాలున్నాయి.

హైదరాబాద్‌కు విస్తరించే ఛాన్స్
హెచ్ఆర్ఏ డిడక్షన్ ఇలా ఉంటుంది. ఒకటి కంపెనీ నుండి పొందిన హెచ్ఆర్ఏ, రెండు మూల వేతనంలో 50 శాతం ఇది మెట్రో నివాస ఉద్యోగులకు, మూడోది మూల వేతనంలో 40 శాతం ఇది నాన్ మెట్రో ప్రాంతంలోని వారికి, నాలుగోది చెల్లించిన అద్దెలో నుండి పది శాతం బేసిక్ ప్లస్ డీఏ తగ్గించి మిగిలిన మొత్తం.. ఇలా ఉంటుంది. ఇందులో ఏది తక్కువ అయితే దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం హెచ్ఆర్ఏ లెక్కింపు కోసం పరిగణించబడుతున్న మెట్రో నగరాల జాబితాలో కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. అవి న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై. అయితే గత కొంతకాలంగా బెంగళూరు, హైదరాబాద్, పుణే, నోయిడా, గురుగ్రామ్ తదితర ఇతర నగరాల్లో హౌస్ రెంట్ మెట్రో నగరాల కంటే వేగంగా పెరిగింది. కాబట్టి రాబోయే బడ్జెట్‌లో మెట్రో నగరాల జాబితాను విస్తరించవచ్చునని నిపుణుల అభిప్రాయం.

వారికి అదనపు ప్రయోజనం
మీరు మీ వేతనంలో భాగంగా హెచ్ఆర్ఏను స్వీకరించినప్పుడు అది పూర్తిగా పన్ను పరిధిలోకి రాదని, దీనికి కొంత మినహాయింపు ఉంటుందని, ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాలకు ఈ పరిధిలో ఉన్నాయని, వచ్చే బడ్జెట్‌లో మరిన్ని నగరాలు జత కలవచ్చునని చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇతర నగరాలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో బాగా ముందుకు వచ్చాయని, ఇందులో బెంగళూరు, హైదరాబాద్, నోయిడా, పుణే, జైపూర్, గురుగ్రామ్ ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో నివసించే వారికి అదనపు హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనాలు ఇవ్వవచ్చునని అంటున్నారు.

పరిమితి పెంచవచ్చు
సెక్షన్ 80జీజీ ప్రకారం వ్యక్తులు హెచ్ఆర్ఏ పొందకపోతే చెల్లించిన అద్దెకు బదులు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చును. అయితే అలాంటి మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అనుమతించబడిన గరిష్ట పరిమితి రూ.60,000 లేదా నెలకు రూ.5000. వచ్చే బడ్జెట్‌లో దీనిని రూ.10,000కు పెంచవచ్చునని నిపుణుల సూచన. టైర్ 1 నగరాలకు టైర్ 2 నగరాలు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిమితిని పెంచవచ్చునని అంచనా.