ఎన్పీఏలుగా వద్దు.. లోన్ మారటోరియంపై తాత్కాలిక ఊరట: వడ్డీ భారం తప్పదు!
లోన్ మారటోరియానికి సంబంధించి రుణగ్రహీతలకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఆగస్ట్ 31వ తేదీలోపు ఎన్పీఏలుగా ప్రకటించని అకౌంట్స్‌ను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. రుణ మారటోరయం కాలానికి గాను వడ్డీలపై వడ్డీ విధించడాన్ని సవాల్ చేస్తూ జారీ చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. వడ్డీపై వడ్డీని విధించడం పట్ల పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాయిదాలపై వడ్డీ విషయంలో పిటిషనర్ల ఆందోళనలను తాము అర్థం చేసుకున్నామని కోర్టు తెలిపింది.
మారటోరియంపై మరో 2ఏళ్ల గడువు! వడ్డీ మాఫీచేస్తే వారికి అన్యాయం చేసినట్లే

కేసు వాయిదా.. 2 నెలల పాటు రుణగ్రహీతలకు ఊరట
లోన్ మారటోరియంకు సంబంధించి వాదనలు ఇంకా పూర్తి కానందున కేసును సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. బ్యాంకు సంఘాల తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, ఆర్బీఐ, కంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహదా వాదనలు వినిపించారు. రాబోయే రెండు నెలల కాలం పాటు ఏ ఖాతాలను ఎన్పీఏలుగా ప్రకటించవద్దని సుప్రీం కోర్టు బ్యాంకులను ఆదేశించింది. ఆగస్ట్ 31వ తేదీలోగా ఎన్పీఏ వర్గీకరణలోకి రాని ఖాతాలన్నింటికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులను అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చు.

వడ్డీని రద్దు చేయలేం
భారత ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగం వెన్నెముక అని, ఆర్థిక వ్యవస్థ పురోగతిని పరిగణనలోకి తీసుకుంటే వడ్డీల మాఫీ ఏ మాత్రం సరికాదన్నది ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయ వైఖరి అని తుషార్ మెహతా నివేదించారు. కరోనా కారణంగా కొన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఫార్మా, ఐటీ వంటి రంగాలపై ప్రభావం సానుకూలంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించేందుకు వడ్డీల రద్దు ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే అభిప్రాయం ఉందన్నారు. పైగా మారటోరియంను రెండేళ్ల పాటు పొడిగించే అవకాశముందన్నారు.

వడ్డీపై వడ్డీ మీద ఆందోళన
దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ... వడ్డీ మీద వడ్డీ వేయడం పైనే తాము ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. కాగా, మారటోరియం కాలంలో వాయిదా వేసిన ఈఎంఐలపై వడ్డీ మాఫీ చేయడం ఆర్థిక మౌలిక సూత్రాలకు విరుద్ధమని, అలాగే నిజాయతీగా రుణవాయిదాలు చెల్లిస్తున్న వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని కేంద్రం ఇటీవలే సుప్రీం కోర్టుకు తెలిపింది.