మరింత కోత: 6 కోట్లమందికి బ్యాడ్‌న్యూస్, ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు!
ఈపీఎఫ్ అకౌంట్ కలిగిన ఆరు కోట్ల మంది ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! పీఎఫ్ వడ్డీ రేటును తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తోన్నట్లుగా తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీరేటును నిర్ణయించేందుకు గురువారం శ్రీనగర్‌లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆప్ ట్రస్టీ(CBT)లు భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటు ఇదే ఉంది.
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటు మొత్తం రెండు వాయిదాల్లో వారివారి ఖాతాల్లో వేయబడుతుందని CBT గతంలో తెలిపింది. ఇందులో 8.15 శాతం ఇన్వెస్ట్‌మెంట్, 0.35 శాతం ఈక్విటీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాగా, 8.5 వడ్డీ రేటు గత ఏడేళ్లలో కనిష్టం. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. అంతకుముందు FY19లో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును 8.65 శాతంగా ఇచ్చింది. FY18లో 8.55 శాతం అమలు చేసింది. FY16లో 8.8, FY14లో 8.75 అమలు చేసింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌కు 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో కేవైసీ ఐడెంటిఫికేషన్ సమస్య కారణంగా వడ్డీ రేటుకు వేచి చూశారు. ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించనున్నారనే అంశం ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.