కస్టమర్లకు అమెజాన్ భారీ షాక్, ఇకపై ప్రతి ఆర్డర్‌కు అదనంగా రూ.5 చెల్లించాల్సిందే
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇకపై కస్టమర్లు ఆర్డర్ చేసే ప్రతి ఆర్డర్‌పై రూ. 5 ఫ్లాట్ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ కొత్త ఛార్జీ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు కూడా వర్తిస్తుంది. కాగా ప్రీమియ వినియోగదారులు ఇప్పటిదాకా అనేక సేవలతో అదనపు ప్రయోజనాలను పొందుతున్నారు. తాజా నిర్ణయంతో వారు షాకింగ్ కు గురవుతున్నారు.
అమెజాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనక మరో బలమైన కారణం కూడా ఉంది. బ్లింకిట్, జెప్టో , స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ వంటి దిగ్గజాలు అదనపు ఛార్జీలను వసూలు చేస్తుండటంతో అమెజాన్ కూడా వారి బాటలోనే నడిచేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే అమెజాన్ ప్రధాన పోటీదారు ఫ్లిప్‌కార్ట్ కూడా 2024 మధ్యలో తన ఆర్డర్‌లపై రూ. 3 వసూలు చేయడం మొదలు పెట్టిన సంగతి విదితమే.

వినియోగదారుల సాంకేతికతపై దృష్టి సారించిన మార్కెట్ సెర్చ్ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్‌లో ప్రముఖ కన్సల్టెంట్ సతీష్ మీనా ఈ విషయం మీద మాట్లాడుతూ.. అమెజాన్ తన మానిటైజేషన్ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటోంది. బ్లింక్ఇట్, స్విగ్గీ, జెప్టో వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లు వేసిన రోడ్ మ్యాప్ మీద అమెజాన్ కూడా నడుస్తోందన్నారు. పైగా ఈ ఛార్జీని చెల్లించకుండా ఉండటానికి వినియోగదారులకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు. వారు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
కాగా రవాణా, సిబ్బంది, ఇంధనం వంటి డెలివరీ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న ఈ కామర్స్ రంగం పెరుగుతున్న ఖర్చులను నిర్వహించడానికి దిగ్గజాలన్నీ ఇప్పుడు ప్రతి ఆర్డర్‌పై ఈ రకమైన రుసుములను వసూలు చేస్తున్నాయని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.అయితే దీనిపై ఈ కామర్స్ దిగ్గజాల నుంచి వింతైన సమాధానం వస్తోంది. కస్టమర్లు తమ సౌలభ్యం కోసం అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాయి. రాబోయే కాలంలో వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ రుసుమును మరింతగా పెంచే అవకాశం ఉందని సతీష్ మీనా తెలిపారు.
గత నెల నుండి అమెజాన్ ఇండియా ప్రతి ఆర్డర్‌పై రూ. 5 మార్కెట్‌ప్లేస్ ఫీజు వసూలు చేయడం స్టార్ట్ చేసింది. కంపెనీ బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఈ ఫ్లాట్ ఫాం ఫీజు అన్ని ఆర్డర్‌లపై వర్తిస్తుంది. అయితే, గిఫ్ట్ కార్డులు, డిజిటల్ సేవలు వంటి కొన్ని వర్గాలకు ఈ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. ఈ ఫీజు అమెజాన్ మిలియన్ల మంది వ్యాపారుల నుండి భారీ రకాల ఉత్పత్తులను అందించడానికి వీలు కల్పిస్తుందని అమెజాన్ చెబుతోంది.
ఈ మార్కెట్ ప్లేస్ ఫీజు గిఫ్ట్ కార్డ్ కొనుగోళ్లు, అమెజాన్ బిజినెస్, బజార్ ఆర్డర్లు లేదా అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్‌లలో చేసిన ఆర్డర్‌లకు వర్తించదు.అలాగే మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులు, ప్రయాణ, సినిమా బుకింగ్‌లు, బీమా, అలెక్సా నైపుణ్యాలు, ఫైర్ టీవీ యాప్‌లు, ప్రైమ్ వీడియో అద్దెలు లేదా కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్‌లు, ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడిన డిజిటల్ ఉత్పత్తులు (సాఫ్ట్‌వేర్ లేదా ఆపిల్ స్టోర్ కోడ్‌లు వంటివి) వంటి డిజిటల్ లావాదేవీలకు కూడా ఈ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
కాగా గతేడాది జూలైలో అమెజాన్ ఇండియా ప్రైమ్ డే 2024 ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ప్రైమ్ డే షాపింగ్ ఈవెంట్ గా నిలిచింది. కంపెనీ ప్రకారం, 2024లో ప్రైమ్ సభ్యులు ఒకే నిమిషంలో 24,196 ఆర్డర్లు చేశారు, ఇది 2023లో 22,190 ఆర్డర్లుగా ఉంది. గత సంవత్సరం నవంబర్‌లో, అమెజాన్ ఇండియా తన నెల రోజుల అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (AGIF) 2024 1.4 బిలియన్ కస్టమర్లు సందర్శించినట్లుగా తెలిపింది. 85% కంటే ఎక్కువ మంది కస్టమర్లు మెట్రోయేతర నగరాల నుండి సందర్శించారు. ఇక గతేడాది మొత్తం మీద అమెజాన్ ఇండియా 1.1 బిలియన్లు మంది సైట్ ని సందర్శించారు. దాదాపు 4 మిలియన్ల కొత్త కస్టమర్లు ప్లాట్‌ఫామ్‌లో చేరారు