For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్ష్మీదేవి కటాక్షం కోసమే.. స్టాక్ మార్కెట్‌లో ‘మూరత్ ట్రేడింగ్’!

|

ఈ రోజు దీపావళి పండుగ. దేశ వ్యాప్తంగా అందరికీ సెలవు దినం. దీపావళి రోజున పిల్లలు, పెద్దలు అందరూ కొత్త దుస్తులు ధరించి, పిండివంటలు భుజించి సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా.. అని ఎదురుచూస్తారు. వ్యాపారస్తులు అయితే దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తారు. చీకటిపడే వేళకు మొదలవుతుంది టపాసుల మోత.

అయితే అందరూ టపాసులు కాల్చడంలో మునిగిన వేళ.. కొంతమంది మాత్రం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌లో పాల్గొంటారు. షేర్లు కొనడం, అమ్మడం చేస్తుంటారు. సాధారణంగా మామూలు రోజుల్లో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ సాయంత్రం 3.30 గంటలకల్లా ముగిసిపోతుంది. కానీ దీపావళి పర్వదినాన మాత్రం సాయంత్రం 6 గంటల తరువాత మొదలవుతుంది. దీనినే 'మూరత్ ట్రేడింగ్'గా వ్యవహరిస్తారు.

ఏమిటీ ‘మూరత్ ట్రేడింగ్'?

ఏమిటీ ‘మూరత్ ట్రేడింగ్'?

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది. అయితే స్టాక్ మార్కెట్‌‌కు కొత్త సంవత్సరం ‘దీపావళి'తో ఆరంభమవుతుంది. స్టాక్ మార్కెట్ పరిభాషలో కొత్త సంవత్సరాన్ని ‘సంవత్'గా వ్యవహరిస్తారు. ఈ దీపావళి రోజున.. మనం అడుగుబెట్టబోతోంది ‘సంవత్ 2076' లోకి. ఇలా ప్రతి దీపావళి రోజున కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని స్టాక్ మార్కెట్‌లో ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహిస్తారు. దీనినే ‘మూరత్ ట్రేడింగ్' అంటారు. అయితే ఈ ట్రేడింగ్ రోజంతా జరగదు. శుభ గడియలను ఎంపిక చేసి.. సాయంత్రంపూట ఓ గంట పాటు నిర్వహిస్తారు.

ఎందుకీ ప్రత్యేక ట్రేడింగ్?

ఎందుకీ ప్రత్యేక ట్రేడింగ్?

దీపావళి రోజున స్టాక్ మార్కెట్‌లో ‘మూరత్ ట్రేడింగ్' నిర్వహించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కోరుతూ జరిపే ఈ ట్రేడింగ్‌కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. కొందరు ఈ మూరత్ ట్రేడింగ్ రోజున తప్పనిసరిగా షేర్లు కొంటారు. అలా చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షం, ఆశీస్సులు ఆ సంవత్ పొడుగునా తమకు ఉంటాయనేది వారి భావన. దీపావళి రోజున జరిపే ట్రేడింగ్‌లో లాభం వస్తే.. ఇక ఆ ఏడాది పొడుగునా తమకు లాభాలే వస్తాయనేది వారి విశ్వాసం. కొంతమంది ఆ రోజున కొన్న షేర్లను అమ్మకుండా అలాగే ఉంచేసుకుంటారు.

ఎక్కడ, ఎలా మొదలైందంటే...

ఎక్కడ, ఎలా మొదలైందంటే...

ఈ మూరత్ ట్రేడింగ్ అనే సంప్రదాయాన్ని గుజరాతీ వ్యాపారులు స్టాక్ మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు చెబుతారు. మన దేశంలో వ్యాపార వర్గాల వారంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది గుజరాతీలే. స్టాక్ మార్కెట్‌లోనూ గుజరాతీల సంఖ్య అధికమే. స్టాక్ బ్రోకర్లు చేసే ‘చోప్డా పూజ' కూడా గుజరాతీ ఆచారమే. ఈ పూజలో భాగంగా మూరత్ ట్రేడింగ్‌కు ముందు స్టాక్ ఎక్స్ఛేంజీలలోని అకౌంట్ పుస్తకాలకు పూజ చేస్తారు. దీపావళికి రెండు రోజులు ముందు వచ్చే ధనత్రయోదశి రోజున కూడా ట్రేడర్లు ఇలా అకౌంట్ పుస్తకాలకు, వాటిని ఉంచే బీరువాలకు పూజలు చేస్తారు. సంపదకు సూచికగా ఆ అకౌంటు పుస్తకాలపై ఒక నాణాన్ని ఉంచుతారు. పూజ అనంతరం ఆ నాణాన్ని భద్రపరిచి మళ్లీ వచ్చే దీపావళి రోజున పూజలో దానిని ఉపయోగిస్తారు.

భక్తి శ్రద్ధలతో లక్ష్మీపూజ...

భక్తి శ్రద్ధలతో లక్ష్మీపూజ...

దీపావళి పర్వదినాన లక్ష్మీదేవి కటాక్షం కోరుతూ ఇళ్లల్లో, కార్యాలయాల్లో పూజ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇక వ్యాపార వర్గాల వారైతే.. రాత్రంతా ఇంటి ముంగిట దీపాలు వెలిగేలా చూసుకుంటారు. ఎందుకంటే.. దీపావళి రోజు రాత్రి ఏదో ఒక సమయంలో లక్ష్మీదేవి నడుచుకుంటూ తన ఇంట్లోకి అడుగుపెడుతుందని వారి భావన. ఇక స్టాక్ మార్కెట్‌‌లో ట్రేడర్లు కూడా ఇదే భావనతో మూరత్ ట్రేడింగ్‌ ప్రారంభానికి ముందు భక్తి శ్రద్ధలతో లక్ష్మీపూజ చేస్తారు. ఇప్పుడంటే ఆన్‌లైన్ ట్రేడింగ్ అధికమైంది కానీ, ఒకప్పుడు షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా.. ఎక్స్చేంజీలు, బ్రోకరేజి సంస్థలకు వ్యక్తిగతంగా వెళ్లాల్సి వచ్చేది. ఇక దీపావళి రోజున అయితే.. ఈ సందడి అంతా ఇంతా కాదు. మూరత్ ట్రేడింగ్ రోజున ట్రేడర్లు సంప్రదాయ దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ట్రేడింగ్‌కు హాజరవుతారు. స్టాక్ ఎక్స్ఛేంజీలు కూడా దీపావళి రోజున రాత్రిపూట దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయి.

గతంలో ‘మూరత్ ట్రేడింగ్' ఇలా...

గతంలో ‘మూరత్ ట్రేడింగ్' ఇలా...

గతంలో 14 మూరత్ ట్రేడింగ్ సందర్భాలలో 11 సార్లు బీఎస్ఈ, సెన్సెక్స్ లాభాలతో ముగిశాయి. ఇక మదుపరులను ఆశ్చర్యంలో ముంచెత్తిన మూరత్ ట్రేడింగ్ 2008 దీపావళి రోజు (అక్టోబర్ 28)న జరిగింది. ఆ రోజున కేవలం గంట వ్యవధిలోనే సెన్సెక్స్ 5.86 శాతం పెరిగింది. ఇక ఈ ఏడాది 2076 సంవత్‌లోనూ సూచీల జోరు కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, వచ్చే దీపావళి నాటికి నిఫ్టీ 13000 మైలురాయిని అధిగమించవచ్చని అంచనా. నేడు దీపావళి సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల వరకు ‘మూరత్ ట్రేడింగ్' నిర్వహిస్తున్నాయి. మర్నాడు అంటే అక్టోబర్ 28న స్టాక్ మార్కెట్‌కు సెలవు.

English summary

లక్ష్మీదేవి కటాక్షం కోసమే.. స్టాక్ మార్కెట్‌లో ‘మూరత్ ట్రేడింగ్’! | Muhurat Trading 2019: BSE, NSE Special One-Hour Trading Session Today

On the occasion of Diwali, stock exchanges BSE and NSE will today hold one-special one-hour Muhurat trading session today, which marks the beginning of the Hindu calendar year Samvat 2076. Today, the special session will be held on from 6.15 pm to 7.15 pm.
Story first published: Sunday, October 27, 2019, 19:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X