న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్బీఐ మాజీ గవర్నర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎకనమిస్ట్ మాజీ చీఫ్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పలు ఇంటర్వ్యూలలో మాట్లాడారు. మంగళవారం ఉద్యోగాలు, జీడీపీ తదితర అంశాలపై మాట్లాడారు. ఆయన తన 'ది థర్డ్ పిల్లర్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్ చేశారు. ఇందుకు ఆయనపై జరుగుతున్న ప్రచారం ఓ కారణం.

విపక్ష కూటమి గెలిస్తే రఘురాం రాజన్ ఆర్థికమంత్రి?
ఈ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి (గ్రాండ్ అలయెన్స్) అధికారంలోకి వస్తే రఘురాం రాజన్ ఆర్థిక మంత్రి అని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోందట. ఇదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రంగంలో ఉపయోగపడతానని అనుకుంటే ఆ రంగంలో బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమేనన్నారు. ప్రస్తుతం తాను ఉన్న స్థానంతో ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. తన ఉపయోగం ఉందని భావిస్తే, అక్కడ కచ్చితంగా ఉంటానని చెప్పారు. ప్రస్తుతం రఘురాం రాజన్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ లేదా రాజకీయ పాత్ర పోషించేందుకు తిరిగి భారత్ వస్తారా అని ప్రశ్నించగా.. అందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

టీడీపీ, బీఎస్పీ, ఎస్పీ, టీఎంసీ కూటమి వస్తే రాజన్?
తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‍వాది పార్టీ, బీఎస్పీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలతో కూడిన అలయెన్స్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఫైనాన్స్ మినిస్టర్‌గా రఘురాం రాజన్ పేరు తెరపైకి వస్తోందని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆర్థిక మంత్రిగా ఆయన ఉండే అవకాశాలు ఉండవచ్చునని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట.

ఎన్నికలకు ముందు అప్రస్తుతం
మంగళవారం నాడు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... మినిమం గ్యారెంటీ స్కీం (న్యాయ్) పథకాన్ని ప్రకటించేందుకు తాము కలిసిన ప్రముఖ ఆర్థికవేత్తల్లో రఘురాం రాజన్ కూడా ఉన్నారని చెప్పారు. ఎన్నికలు ఇంకా కాలేదని, ఇలాంటప్పుడు పాలసీ మేకింగ్‌లో కీలక పదవి చేపడతారనే అంశంపై మాట్లాడితే అది సరికాదని అభిప్రాయపడ్డారు. భారతదేశానికి ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, సంస్కరణలు చేపట్టాల్సి ఉందని, వినేవారు ఉంటే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు.


Click it and Unblock the Notifications