పసిడి పతనం ప్రారంభం: గోల్డ్ బాండ్ పై ఇన్వెస్ట్ చేయొచ్చా.. ఏది సురక్షితం..?
గత ఆరు రోజుల్లో తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారంపై దాదాపుగా రూ.1800 తగ్గింది. దీంతో భారత్‌లోని బంగారం మార్కెట్లలో ధరలు భారీగా పడిపోయాయి. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.47,770గా ఉంది. ఇది సావెరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (SGB) 2021-22 సిరీస్ వీ జారీ చేసిన దానికంటే తక్కువగా పడిపోయింది.
అంటే సావెరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ పథకంను రూ.47,900కు ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఆన్‌లైన్ ద్వారా ఈ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కొనుగోలు చేసేవారికి గ్రాము పై రూ.50 డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ లెక్కన చూస్తే ఆన్‌లైన్‌లో సావెరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కొనుగోలు చేసిన వారికి బాండు రూ.47,400కే దక్కిందని చెప్పాలి.

పడిపోతున్న పసిడి ధరలు
ఒకవేళ పసిడి ధరలు ఇంకా కిందకు పడిపోతే ఆన్‌లైన్ ద్వారా జారీ అయిన ఎస్‌జీబీ ధరకు మించి కిందకు పడిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. సావెరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సిరీస్ వీ 13 ఆగష్టు 2021న ముగియనుంది. అయితే బంగారం ధరలు అనుకున్న దానికంటే కిందకు పడిపోతుండటంతో అందునా ఎస్‌జీబీ ఇష్యూ చేసిన ధరకంటే పడిపోతే బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఏది బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందో తెలుసుకుందాం.

వస్తువు రూపంలో ఉన్న బంగారం
ఇక బంగారంపై ఏ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలనో అంటే పసిడిపైనా లేక ఎస్‌జీబీ ఇష్యూ చేసే బాండ్లపైనా అని తెలుసుకునేముందు ఇందులో రిస్క్‌తో పాటు సానుకూల ఫలితాలు కూడా ఉంటాయన్న సంగతి ఇన్వెస్టర్ గ్రహించాలి. ఒకవేళ బంగారంను కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకుంటే.. అది దొంగలపాలవ్వచ్చు, లేదా ఎక్కడో మనమే అజాగ్రత్తతో పోగొట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నందున... వెంటనే ఓ బ్యాంకు లాకర్‌ను అద్దెకు తీసుకుని బంగారంను అందులో పెట్టాలి. ఇంతటితో అయిపోలేదు. బంగారం విలువైన వస్తువు కాబట్టి దానికి బీమా కూడా చేయించాలి. బ్యాంకులో ఏదైనా ప్రమాదం జరిగితే బీమా ఉంటే బంగారంపై రికవరీ వస్తుంది. ఇక బంగారంపై సాధారణంగా ఉండే ఖర్చులతో పాటు దాన్ని తిరిగి అమ్మాలంటే ఇన్వెస్టర్‌కు మేకింగ్ ఛార్జీలు కూడా రావు. ఈ మొత్తం కూడా భారీగానే ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి.

సావెరీన్ గోల్డ్ బాండ్
ఇక సావెరీన్ గోల్డ్ బాండ్‌పై ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు పెద్దగా రిస్క్ తీసుకోఅక్కర్లేదు. ఎందుకంటే డిజిటల్ రూపంలో ఉన్న బంగారం ఎస్‌జీబీ జారీ చేసే వారి వద్ద భద్రంగా ఉంటుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటుంది. తాను ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ పై ఆందోళన చెందాల్సిన పనిలేదు.
గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెట్టి ఇన్వెస్టర్ నిశ్చింతగా ఉండొచ్చు. ఇందుకు అదనంగా అయ్యే ఖర్చు కూడా ఉండదు. అంతేకాదు ఇలా గోల్డ్ బాండ్స్ పై ఇన్వెస్ట్ చేసిన వారికి రెగ్యులర్‌గా రిటర్న్స్‌ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది ఏడాదికి 2.5శాతం వడ్డీ ఇస్తుంది. ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీద వడ్డీ ఆరు నెలలకు ఒకసారి జమచేయడం జరుగుతుంది.
సావెరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ పై ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు మెచ్యూరిటీ పై వచ్చే ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అదే వస్తువు రూపంలో ఉన్న బంగారంను మూడేళ్ల తర్వాత అమ్మకానికి పెడితే ఇన్వెస్టర్ 20శాతం పన్ను, దానిపై 4 శాతం సెస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.