Post Office Scheme: పెళ్లి తర్వాత రిస్క్ లేని ఈ పోస్టల్ ఖాతా తెరవండి.. నెలకు రూ.4,950 పొందండి..
Post Office Scheme: మార్కెట్ ఒలటాలిటీ ప్రమాదం మధ్య.. పెట్టుబడులు పెట్టే వారు సరైన ఎంపికలు చేసుకోవటం చాలా ముఖ్యం. పెట్టుబడి మెుత్తానికి పూర్తి సురక్షత ఉండే స్కీమ్స్ వల్ల హామీతో కూడిన రాబడి అందుతుంది. ఇలా సేఫ్ రిటర్న్స్ ఉండాలని భావించే వారికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మంచి ఎంపిక. ఇది సూపర్ హిట్ అయిన చిన్న పొదుపు పథకం కూడా. దినిలో మీరు కేవలం ఒక్కసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది. MIS ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలుగా ఉంది. అంటే.. ఐదేళ్ల తర్వాత పెట్టుబడిదారునికి.. హామీతో కూడిన నెలవారీ ఆదాయాన్ని పొందడం ప్రారంభిస్తారు. ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గరిష్ఠ పెట్టుబడి ఎంతంటే..
POMIS స్కీమ్‌లో సింగిల్, జాయింట్ ఖాతాను తెరిచేందుకు వెసులుబాటు ఉంది. కనీసం.. రూ.1,000 పెట్టుబడితో ఈ ఖాతాను తెరవవచ్చు. మీరు ఒకే ఖాతాలో గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదే సమయంలో.. ఉమ్మడి ఖాతాలో పెట్టుబడి పరిమితి రూ.9 లక్షల వరకు అనుమతించబడుతుంది.

MIS ప్రయోజనాలు.. ప్రభుత్వ గ్యారెంటీ..
పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతా తెరవవచ్చు. ఈ ఖాతాకు వచ్చే ఆదాయాన్ని ప్రతి సభ్యునికి సమానంగా ఇవ్వబడుతుంది. మీరు ఎప్పుడైనా ఉమ్మడి ఖాతాను ఒకే ఖాతాగా మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అలాగే.. ఒకే ఖాతాను ఉమ్మడి ఖాతాగా కూడా మార్చుకోవచ్చు. ఎలాంటి మార్పులకైనా అందరు సభ్యులు దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తరువాత దీనిని మరో ఐదు సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. ఈ ఖాతాకు నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. డబ్బుకు ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది.

ప్రస్తుత వడ్డీ రేటు..
ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. నెలవారీ ఆదాయ పథకం వార్షికంగా 6.6% వడ్డీని పొందుతోంది. దీనిని ప్రతి నెలా చెల్లిస్తారు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో భారతీయ పౌరులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు.

మధ్యలో నిలిపివేయాలంటే..
పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్ మెచ్యూరిటీ ఐదు సంవత్సరాలు. అయితే అనుకోని కారణాల వల్ల దీనిని మూసివేయాలనుకుంటే అందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే పెట్టుబడిదారు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్య డబ్బును విత్‌డ్రా చేస్తే, డిపాజిట్ మొత్తంలో 2% తిరిగి ఇవ్వబడుతుంది. మీరు ఖాతా తెరిచిన 3 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా డబ్బును విత్‌డ్రా చేసినట్లయితే.. 1 శాతం తీసివేసిన తర్వాత మిగిలిన మెుత్తం రీఫండ్ చేయబడుతుంది.

MIS ఖాతాను ఎలా తెరవాలి?
పోస్టాఫీసులో MIS ఖాతాను తెరవడానికి.. మీరు తప్పనిసరిగా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి.
* దీని కోసం ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ లేదా ఓటర్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ రుజువుగా అందించాల్సి ఉంటుంది.
* 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు అవసరం.
* అడ్రస్ ఫ్రూఫ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన ID కార్డ్ లేదా యుటిలిటీ బిల్లు చెల్లుబాటు అవుతుంది.
* ఈ పత్రాలను తీసుకెళ్లి సమీపంలోని పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ తెరిచేందుకు స్కీమ్ ఫారమ్‌ను పూరించవచ్చు.
* మీరు దీన్ని ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఫారమ్‌ను పూరించే సమయంలో నామినీ పేరు తప్పక ఇవ్వండి.
* ఈ ఖాతాను తెరిచేందుకు ప్రారంభంలో రూ. 1,000 నగదు లేదా చెక్కు ద్వారా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.