బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? త్వరలో ధరలు భారీగా పెరగవచ్చా?
గతవారం పెరిగిన బంగారం ధరలు ఈవారం కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్ రూ.48,000కు దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 1825 డాలర్లు దాటిన పసిడి ఆ తర్వాత 1816 డాలర్ల స్థాయిలో ముగిసింది. నేడు స్వల్పంగా పెరిగి 1818 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8400 తక్కువగా ఉంది. కామెక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 250 డాలర్లకు పైగా తక్కువగా ఉంది.

బంగారం ధర బై-జోన్, సెల్-జోన్
అధిక డిమాండ్ నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో బంగారం దిగుమతులు ఏడాది ప్రాతిపదికన రెండింతలు పెరిగి 38 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఆర్థిక రికవరీ నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగి, కాస్త పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. షేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ రీసెర్చ్ హెడ్ రవి సింగ్ ప్రకారం గోల్డ్ బై-జోన్ రూ.48,000, టార్గెట్ ధర రూ.48,500. సెల్-జోన్ రూ.47,600, టార్గెట్ ధర రూ.47,400.

ధరలు తగ్గి.. పెరిగే ఛాన్స్
బంగారం, వెండి ధరలు ఇటీవల తీవ్ర ఊగిసలాటలో కనిపిస్తూ, స్వల్ప పెరుగుదలను నమోదు చేస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరిగినప్పటికీ, మీడియం కాలంలో కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయని, వీటిని పరిగణలోకి తీసుకొని ప్రాఫిట్ బుక్ చేయాలని, కొనుగోళ్లు చేయాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో పసిడి ధరలు పెరుగుతాయని, 2022 మొదటి అర్ధ సంవత్సరంలో భారీగా తగ్గి, రెండో అర్ధ సంవత్సరం నాటికి రూ.55,000కు చేరుకోవచ్చునని మార్కెట్ వర్గాలు ఇప్పటికే చెబుతున్నాయి.

నేటి ధరలు
ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి (సోమవారం) ప్రారంభ సెషన్‌లో రూ.67 పెరిగి రూ.47,845, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.81 ఎగిసి రూ.47,967 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.207 లాభపడి రూ.61,810 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.163 లాభపడి రూ.62,424 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 3 డాలర్లు లాభపడి 1819 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.122 డాలర్లు ఎఘిసి 23.040 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.