బడ్జెట్‌లో పన్ను, ఐటీ రిటర్న్స్ మినహాయింపులు.. షరతులు వర్తిస్తాయి
న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను పరంగా కొన్ని ఊరట ప్రకటనలు చేశారు. ఈ పన్నుకు సంబంధించి కొంత ఉపశమనం కలిగించినప్పటికి, ఈ ప్రతిపాదనలను లోతుగా చదివితే, కొన్ని షరతులు కనిపిస్తాయి. సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్న్స్, శాలరైడ్‌కు ఎల్టీసీ క్యాష్ స్కీం, ఆస్తుల క్రయ, విక్రయాల్లో స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి శుభవార్త చెప్పారు నిర్మలమ్మ. ఇవి అందరికీ వర్తించవు. వాటి గురించి తెలుసుకుందాం...
రూ.2.5 లక్షల మొత్తంపై వడ్డీకే పన్ను మినహాయింపు, ఇదీ లెక్క..

వీరికి ఆ ప్రయోజనం లేదు
బడ్జెట్ ప్రకటన సందర్భంగా 75 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు ప్రధానంగా పెన్షన్, బ్యాంకు వడ్డీలపై ఆధారపడతారు. వీరికి ఈ బడ్జెట్‌లో భారీ ఊరట లభించింది. సీనియర్ సిటిజన్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారు సమర్పించే డిక్లరేషన్ ఆధారంగా బ్యాంకు... పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించాలి.
ఆ మేరకు దానిపై పన్నును తగ్గించాలి. ఈ ప్రయోజనం సదరు సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఉద్యోగి లేదా అధికారి అయి ఉండటంతో పాటు ఒకే బ్యాంకు ఖాతాలో పెన్షన్ జమ అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరంలేదు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు, పెన్షన్ మినహా బ్యాంకుల్లో జమ అయిన మొత్తంపై ఐటీ మినహాయింపులేదు.

ఐటీ మినహాయింపులు
ఎవరైనా ఓ వ్యక్తి స్థిర ఆస్తి క్రయ,క్రయాలకు స్టాంప్ డ్యూటీ వ్యాల్యూయేషన్‌కు అనుగుణంగా ఐటీ మినహాయింపులు ఉంటాయి. 2013లో స్థిరాస్తి వాస్తవ విక్రయ వ్యాల్యూ ఐదు శాతం స్టాంప్ డ్యూటీ కంటే తక్కువగా ఉంటే మినహాయింపులు ఉండేవి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంప్ డ్యూటీ పరిమితిని పది శాతానికి పెంచారు. తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇరవై శాతానికి పెంచారు.
అయితే 20 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు పరిమితమైన ట్రాన్సాక్షన్స్‌కు వర్తిస్తుంది. గత ఏడాది నవంబర్ 12 నుండి వచ్చే జూన్ 30 మధ్య తొలిసారి రెసిడెన్షియల్ యూనిట్ అలాట్మెంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఒక యజమాని నుండి ఇల్లు కొనుగోలు చేస్తే 10 శాతం లిమిట్ మాత్రమే వర్తిస్తుంది.

ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీం
శాలరైడ్ LTC క్యాష్ వోచర్ స్కీం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి LTC స్కీంలో వస్తువులు, ఇతర సేవల కొనుగోళ్లపై పన్ను యధాతథంగా విధిస్తారు. శాలరైడ్ జమ చేసుకునే EPF మొత్తం రూ.2.5 లక్షలు దాటితే దాని వడ్డీపై పన్ను విధిస్తారనే అంశంపై స్పష్టత రాలేదు. 2021 ఏప్రిల్ ఒకటవ తేదీకి ముందు జమ అయిన 2.5 లక్షల EPF మొత్తం వడ్డీపై పన్ను వర్తిస్తుందా? లేదా? అన్నది తెలియాలి.